Crisil Rating Report: రాబోయే కొన్ని నెలల్లో దేశంలో ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదార్లు నిధులు ఉపసంహరిస్తుండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలకు దేశీయ ఒడుదొడుకులు తోడవుతాయని పేర్కొంది. మార్చిలో తమ ఆర్థిక పరిస్థితుల సూచీ (ఎఫ్‌సీఐ) సున్నా దిగువకు చేరిందని, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్షీణించడాన్ని ఇది సూచిస్తోందని వెల్లడించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు పెద్ద బ్యాంకులు రుణ రేట్లు పెంచాయని, రుణ వ్యయాల పెరుగుదలకు ఇది దారితీయొచ్చని అభిప్రాయపడింది. అయితే కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు, విదేశీ మారకపు నిల్వల బలోపేతానికి చేపట్టిన చర్యలు అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునేందుకు దోహదపడతాయని క్రిసిల్ వివరించింది. ఈక్విటీ, డెట్, మనీ, ఫారెక్స్ మార్కెట్లలో 15 కీలక అంశాలను విశ్లేషించి, ఎఫ్‌సీఐ సూచీని క్రిసిల్ రూపొందిస్తుంది. క్రిసిల్ తన నివేదికలో ఏమందంటే..
దశాబ్ద సగటు కంటే అధిక ఒత్తిడి:ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆర్థిక పరిస్థితులు కఠినం కావడమే కాకుండా గత దశాబ్ద సగటు పరిస్థితులతో పోలిస్తే ఎక్కువ ఒత్తిడితో ఉన్నాయి. ముడిచమురు ధరలు బాగా పెరగడం వల్ల జీడీపీ, ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, రూపాయి, ద్రవ్యలోటు వంటి ప్రధాన ఆర్థిక సూచికలపై ప్రభావం పడుతోంది.