అమెరికా, ఐరోపా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఎగుమతుల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలును కొన్ని దేశాలు నిలిపేశాయి. దీంతో ముడిచమురుకు కొరత ఏర్పడి, బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 140 డాలర్ల వరకూ వెళ్లినా, ఇప్పుడు 100 డాలర్ల వద్ద కదలాడుతోంది. రష్యా నుంచి వచ్చే లోహాల ధరలకూ కొరత ఏర్పడి, వాటి ధరలూ పెరిగాయి. ఉక్రెయిన్ నుంచి గోధుమలు, సన్‌ఫ్లవర్ నూనె సరఫరాలు స్తంభించి, ఆహార పదార్థాల ధరలూ పెరిగాయి. అమెరికాలోనూ ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2% కంటే పైనే ద్రవ్యోల్బణం నమోదు కావడం ప్రారంభమయ్యాక, గిరాకీని-నగదు చెలామణిని అదుపు చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. వడ్డీరేట్లు పెంచుతోంది.
డాలరుకు బలం ఇలా..
- అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది. ఇందువల్ల వాటిని కొనేందుకు ఆసక్తి పెరిగింది. దీంతోపాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఉంది. అంతర్జాతీయ వర్తకం అంతా డాలర్లలోనే జరుగుతుందనేది తెలిసిన విషయమే. . ఫలితంగా డాలర్లే ప్రపంచంలో అత్యంత భద్రమైన ఆస్తిగా భావించడం పెరిగింది.
- అమెరికాలో వడ్డీరేట్లు సున్నాగా ఉన్నప్పుడు, అక్కడి నుంచి పెట్టుబడులు భారత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి తరలి వచ్చేవి. ఈ దేశాల్లో మార్కెట్లు రాణించడంతో, వారికి అధిక ప్రతిఫలం లభించేది. అయితే బాండ్లపై ప్రతిఫలం పెరిగాక, వర్థమాన దేశాల్లో ఈక్విటీలు విక్రయించి, పెట్టుబడులను వెనక్కి పట్టికెళ్లడం పెరిగింది. ఫలితంగా డాలర్‌కు గిరాకీ పెరిగి, రూపాయి పతనమైంది.
- 1999లో యూరోను ఐరోపా దేశాల సమాఖ్య ఆవిష్కరించింది. ఇప్పుడు 19 దేశాల్లో ఆ కరెన్సీ అమల్లో ఉంది. 2002 డిసెంబరులో డాలరు కంటే తక్కువగా ఉన్న యూరో విలువ, ఆ తరవాత పెరిగి ఇటీవలి వరకు ఎక్కువగానే ఉండేది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, మాంద్యం భయాలు ఐరోపాలో పెరిగాయి. తమపై విధించిన ఆంక్షలకు నిరసనగా జర్మనీకి శాశ్వతంగా గ్యాస్ సరఫరాను రష్యా నిలిపేస్తే, పరిస్థితి మరింత దుర్భరమవుతుందని ఐరోపా వాసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే డాలర్ సురక్షితమని భావించి, దానిపై పెట్టుబడులు పెరగడం వల్ల, విలువ హెచ్చుతోంది.