ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన డీఎల్ఎఫ్కు చెందిన ఫ్లాట్లు హాక్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటిని కొనేందుకు ప్రజలు విపరీతంగా పోటీపడ్డారు. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఆఫీస్ ముందు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లాట్లు కొనేందుకు ఎగబడ్డారు. డీఎల్ఎఫ్ సంస్థ కొత్తగా ప్రారంభించిన విలాసవంతమైన ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల కోసం జనం ఇలా పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను.. డీఎల్ఎఫ్ సంస్థ గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఏడు కోట్ల రూపాయలు విలువైన 1,137 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ విలాసవంతమైన నివాస గృహాలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ కార్యాలయానికి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులంతా పోటెత్తారు. ఆఫీస్ ముందు బారులు తీరారు. మూడు రోజుల్లోనే మొత్తం ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
దిల్లీకి చెందిన రీసెర్చ్ అనలిస్ట్, వీకెండ్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకులైన అలోక్ జైన్.. డీఎల్ఎఫ్ ఆఫీస్ ముందు జనం బారులు తీరి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఫొటో కింద పలు ఆసక్తికర అంశాలను రాసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోయిందని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డీఎల్ఎఫ్ ఆఫీస్ ముందు జనం బారులు "రూ. 7 కోట్లు విలువైన విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు.. డీఎల్ఎఫ్ కార్యాలయం ముందు ప్రజలు బారులు తీరారు. అక్కడి నుంచే ఓ వ్యక్తి నాకు ఈ ఫొటోలను పంపారు." అని అలోక్ జైన్ తెలిపారు. అలోక్ జైన్.. గురువారం ఈ వైరల్ ఫోటోను షేర్ చేశారు. కంపెనీకి సంబంధించిన 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని జైన్ తెలిపారు. ఈ విషయాన్ని ఓ డీఎల్ఎఫ్ బ్రోకర్ తనకు చెప్పారని వెల్లడించారు. అలోక్ చేసిన ఫోస్ట్పై పలువురు వివిధ రకాలుగా స్పందించారు.
గురుగ్రామ్‌లోని సెక్టార్ నెం 63లో 'అర్బర్' పేరుతో లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను డీఎల్ఎఫ్ లాంఛ్ చేసింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కంపెనీ ఇంతటి భారీ, ఎత్తయిన గృహసముదాయాన్ని నిర్మిస్తోంది.