DMF or FD Which Is Better : శ్రమించి సంపాదించిన డబ్బులను జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అన్ని ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని రాబడి ఎక్కువగా వచ్చే చోట పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో కొందరు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు మొగ్గుచూపుతారు. మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. అధిక రాబడికి ఈ రెండూ మంచి మార్గాలే. అయితే వీటిల్లో ఏది అత్యుత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్డ్ డిపాజిట్లు..
FD Gives Good Returns : బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి తమకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఎఫ్డీకి కాలపరిమితి ఉంటుంది. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి ఈ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. దీన్ని బట్టే బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. అయితే వృద్ధులకు బ్యాంకులు 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వాళ్లు ఎక్కువగా ఎఫ్డీలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఎఫ్డీలపై ఎంత వడ్డీ ఇస్తారనే వివరాలను బ్యాంకు వెబ్సైట్ల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
MF vs FD : ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో దాన్ని బట్టి ఎక్కడ ఎఫ్డీ చేయాలో నిర్ణయించుకోవాలి. ఎక్కువ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. ఎఫ్‌డీల మీద వచ్చే సొమ్మును ఇతర ఆదాయ వనరుగా పరిగణిస్తారు. అందుకే వీటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఏడాది కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ రేటు రూ.40 వేల కంటే తక్కువగా ఉంటే మాత్రం బ్యాంకులు టీడీఎస్‌ను తగ్గించవు. ట్యాక్స్ సేవర్ ఎఫ్డీ పథకాల కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. కాలపరిమితి కంటే ముందుగా ఎఫ్‌డీలోని సొమ్మును తీసుకుంటే బ్యాంకులు పెనాల్టీ కింద చార్జీలు వసూలు చేస్తాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్స్..
Debt Mutual Funds : ఈమధ్య కాలంలో పెట్టుబడులకు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఎంపిక అనే చెప్పాలి. ఇందులో వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. అయితే ముందుగా ఒక లక్ష్యం అనుకొని దాని ప్రకారం పెట్టుబడి పెట్టాలి. ఎందుకు పెట్టుబడి పెడుతున్నామో తెలుసుకోకుండా.. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ఆపిటైట్తో సరిపడని తప్పుడు పెట్టుబడికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సరైన లక్ష్యం పెట్టుకొని, దీర్ఘకాలీక ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ పెట్టుబడి పెడితే ఇక్కడ తిరుగే ఉండదు. ఈ నేపథ్యంలో అసలు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఉత్తమమంటే..
- మిగతా మ్యూచువల్ ఫండ్స్ లాగే డెట్ మ్యూచువల్ ఫండ్ (డీఎంఎఫ్) కూడా సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోస్ ఆధారంగానే పనిచేస్తుంది. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే డెట్ మ్యూచువల్ ఫండ్‌లో అధిక వడ్డీ రేట్లను అందిస్తారని నిపుణులు అంటున్నారు.
- ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా అధిక రాబడులను డెట్ మ్యూచువల్ ఫండ్ ఆఫర్ చేస్తోంది. భారీ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టే ఎక్కువ మంది ఇటు వైపు ఆకర్షితులు అవుతున్నారు.
- బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు నిర్దేశిత కాలపరిమితిలోపు ఎఫ్‌డీలోని డబ్బులను తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎఫ్డీ సొమ్మును ఉపసంహరించుకోవాలంటే పెనాల్టీ కింద ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అదే డీఎంఎఫ్ లో తక్కువ లాక్ పీరియడ్‌లో బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
- ఒకప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద భారీగా వడ్డీ రేట్లను అందించేవారు. అయితే ఇవి కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేశాయి. దీంతో ఎఫ్డీలపై ఎలాగైతే పన్నులను చెల్లిస్తామో.. అలాగే డీఎంఎఫ్ పెట్టుబడుల మీదా ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. ఈ విషయంలో ఎఫ్డీ, డీఎంఎఫ్‌లో పెద్ద తేడాలేమీ లేవు.
- డీఎంఎఫ్‌లో వడ్డీ రేట్లకు సంబంధించి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో రాబడులు, వడ్డీ రేట్లు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి. అంటే వడ్డీ రేటు తగ్గితే రాబడి పెరగొచ్చు. వడ్డీ రేటు పెరిగితే రాబడి తగ్గొచ్చు. కానీ బ్యాంకు ఎఫ్డీలకు అలా ఉండదు. కాలపరిమితికి ఫలానా వడ్డీ రేటు అనేది ఫిక్స్ అయితే ఇక దాని ప్రకారమే రిటర్న్స్ ఉంటాయి.
- డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టే పెట్టుబడులపై పన్ను మినహాయింపులను తీసేశారు. 2023, ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక బిల్లుతో డీఎంఎఫ్‌లో పెట్టే పెట్టుబడులకు ట్యాక్స్ బెనిఫిట్స్ లేకుండా పోయాయి.
- డీఎంఎఫ్‌లో పెట్టే పెట్టుబడుల కాలపరిమితి మూడేళ్లలోపు ఉంటే దానిపై మీ ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులపై కూడా వినియోగాదారుల ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి పన్ను కట్టాలి. పెట్టే పెట్టుబడి, ఇన్వెస్టర్‌ను బట్టి చెల్లించాల్సిన పన్ను శాతం పెరుగుతూ ఉంటుంది. ఇందులో అత్యధిక పన్ను శాతం 35.8 శాతంగా ఉంది. ఇందులో సర్ ఛార్జీలు, సెస్ కూడా కలిసే ఉంటాయి.