DIGITAL CURRENCY RBI : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్‌తో పలు చర్చలు జరిపినట్లు ఎఫ్‌ఐఎస్ సీనియర్ డైరెక్టర్ జూలియా డెమిదోవా వెల్లడించారు. ఆర్‌బీఐతో ఇప్పటికే పనిచేసిన అనుభవం తమకు ఉందని, సీఐఎస్ వ్యవస్థలతో సీబీడీసీ నిర్వహణ అవకాశాలను చూస్తున్నట్లు తెలిపారు. సీబీడీసీలపై అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకర్లతో రౌండ్‌టేబుల్ సమావేశాలు, వర్క్‌షాప్‌లను ఎఫ్‌ఐఎస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రొగ్రామబుల్ చెల్లింపులు, కొత్త పరపతి విధాన టూల్‌కిట్, వడ్డీ రహిత సీబీడీసీ, ఫ్రాక్షనల్ బ్యాంకింగ్ సమస్యలు, అందరికీ ఆర్థిక సేవలు, సీమాంతర సీబీడీసీ చెల్లింపులపై కేంద్ర బ్యాంకులకు సలహాలు ఇస్తున్నట్లు డెమిదోవా తెలిపారు.
బ్లాక్ చెయిన్ సాంకేతికత వినియోగం:
సీబీడీసీకి ఆర్‌బీఐ తోడ్పాటు ఉంటుంది. దీన్ని డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కాగిత కరెన్సీలోకి కూడా మార్చుకుని, ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో చూపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో డిజిటల్ కరెన్సీ న్యాయబద్ధతకు ఢోకా ఉండదు. సీబీడీసీ అభివృద్ధికి ఆర్‌బీఐ బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉందని, నియమ నిబంధనలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.