Different Types Of Number Plates In India :దేశంలోని ప్రతీ వాహనానికి నంబర్ ప్లేట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వాహనం నడిపోతే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారు. వాహనాలను, వాహనదారులను సులువుగా గుర్తించడానికి వీలుగా నంబర్ ప్లేట్‌ను రవాణశాఖ కేటాయిస్తుంది. ప్రతీ వాహనానికి ఉండే నంబర్ ప్లేట్ అనేది భిన్నంగా ఉంటుంది. ద్విచక్ర వాహనం, కారు.. ఇలా ఒక్కో వాహనానికి ఉండే నంబర్ ప్లేట్ ఒక్కో రంగులో విభిన్నంగా ఉంటుంది. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఇవి వివిధ రకాల రంగుల్లో ఎందుకు ఉంటాయి? వీటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుపు రంగు నంబర్ ప్లేట్
White Number Plate :భారతదేశంలో తెలుపు రంగులో ఉండే నంబర్ ప్లేట్లను ఎక్కువగా చూస్తూ ఉంటాం. తెలుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో ఆక్షరాలు ముద్రిస్తారు. ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ తెలుపు రంగు నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ముఖ్యంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం లేదా వాహనాన్ని అద్దెకు ఇవ్వడం లాంటివి చేయకూడదు.
పసుపు రంగులో ఉంటే..
Yellow Number Plate :ఇక కార్లపై పసుపు రంగులో ఉండే నంబర్ ప్లేట్‌ను చూసే ఉంటారు. పసుపు రంగులో ఉండే ప్లేట్‌పై నలుపు రంగులో ఆక్షరాలు ఉంటాయి. టాక్సీలు, ఆటోలు లాంటి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు. వీటిని అద్దెకు ఇచ్చుకోవడం, ప్రయాణికులను ఎక్కించుకోవడం లాంటివి చేయవచ్చు. ఈ వాహనాలకు ట్యాక్స్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వాహనాలను నడిపే డ్రైవర్లు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
పచ్చ రంగులో ఉంటే అర్ధం ఏంటి..?
Green Number Plate : కార్లు, ఆటోలపై పచ్చ రంగులో ఉంటే నంబర్ ప్లేట్లు కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మత్రమే ఇలాంటి నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. పచ్చ రంగు ప్లేట్‌పై తెలుపు రంగులో ఆక్షరాలు ముద్రించి ఉంటాయి. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేస్తారు.
రెడ్ కలర్‌లో ఉంటే..
Red Number Plate : రెడ్ కలర్‌లో ఉండే నంబర్లు ప్లేట్ కలిగిన వాహనాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎరుపు నంబర్ ప్లేట్‌పై తెలుపు రంగు ఆక్షరాలు ఉంటాయి. వెహికల్‌కి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేంత వరకు తాత్కాలికంగా రెడ్ నంబర్ ప్లేట్ ఉపయోగించుకోవచ్చు. టెస్టింగ్ వాహనాలకు ఎక్కువగా ఈ నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు. ఈ నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది.