Difference Between Nominee And Legal Heir : నామినీ అనే పదాన్ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే వింటారు. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో నామినీ పేరును నమోదు చేసి ఉంటారు. అయితే చట్టపరమైన వారసులు, నామినీ.. ఒక్కరేనా లేదా వారి మధ్య ఏమైనా బేధం ఉందా? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఇప్పుడు మనం నామినీ, చట్టబద్ధమైన వారసులకు మధ్య గల సంబంధం, తేడాల గురించి తెలుసుకుందాం.
ప్రధానమైన తేడా ఏమిటి?
Nominee Vs Legal Heir : చట్టపరంగా చూస్తే, యజమాని మరణించినప్పుడు.. అతని ఆస్తిని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక కస్టోడియన్గా నియమించే వ్యక్తినే నామినీ అంటారు. యజమాని మరణించిన సందర్భంలో మాత్రమే నామినీ సదరు ఆస్తిని క్లెయిమ్ చేయవచ్చు. వారసత్వ చట్టం (లేదా వీలునామా) ప్రకారం.. చట్టపరమైన వారసులు వచ్చేంత వరకు నామినీ లేదా నామినీలు ఆ ఆస్తికి సంరక్షకులుగా మాత్రమే ఉంటారు. చట్టబద్ధమైన వారసులు వచ్చిన తరువాత ఆ ఆస్తిని వారికి అప్పగిస్తారు.
నామినీల కర్తవ్యం, బాధ్యత
Legal Rights Of Nominee :వాస్తవానికి నామినీ, చట్టపరమైన వారసులు ఇద్దరూ వేర్వేరు. యజమాని స్పష్టంగా నామినేట్ చేస్తే.. నామినీగా ఉన్న వ్యక్తి చట్టపరమైన వారసుడు కావచ్చు. కానీ అతని/ఆమె పేరు కూడా వీలునామాలో స్పష్టంగా రాసి ఉన్న పక్షంలో మాత్రమే ఇది జరుగుతుంది. అప్పుడు కూడా చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే.. వారికి మాత్రమే ఆస్తి హక్కులు వర్తిస్తాయి. నామినీలు మైనర్లకు సంరక్షకులుగా వ్యవహరించవచ్చు. అలాగే ఆ పిల్లల సంక్షేమాన్ని చూడవచ్చు. వాస్తవానికి మరణించిన యజమాని ఆస్తిలో ఆ పిల్లల వాటాను కాపాడవలసిన బాధ్యత నామినీలపై ఉంటుంది. అంటే ఆస్తి యజమాని మరణించిన తర్వాత.. అతని ఆస్తి హక్కులను బదిలీ చేయడానికి తాత్కాలికంగా నియమితమైన వ్యక్తే నామినీ.