DGCA SpiceJet pilots: సరైన శిక్షణ పొందని 90 మంది పైలట్లపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కొరడా ఝులిపించింది. స్పైస్‌జెట్ నియమించుకున్న ఈ పైలట్లు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధించింది. వీరంతా సరిగా శిక్షణ తీసుకోలేదని గుర్తించిన డీజీసీఏ... ఈ మేరకు చర్యలు తీసుకుంది. 'ప్రస్తుతానికి ఈ పైలట్లు 'మ్యాక్స్' విమానాలు నడపకుండా ఆంక్షలు విధిస్తున్నాం. పైలట్లంతా మరోసారి శిక్షణ తీసుకోవాలి. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసినవారు విమానాలు నడపొచ్చు' అని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి పైలట్ల నియామకం వెనక ప్రధాన కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
విమాన ప్రమాదం నేపథ్యంలో చర్యలు:ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన 737 బోయింగ్ మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2019 మార్చి 13లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ తరహా విమానాలను డీజీసీఏ నిషేధించింది. బోయింగ్ సంస్థ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిన తర్వాత గతేడాది ఆగస్టులో నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విమానాలు నడిపే పైలట్లు అందరూ సరైన శిక్షణ తీసుకోవాలని అప్పట్లోనే స్పష్టంగా చెప్పింది.