కొవిడ్ ముందు దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.1 కోట్లు.. గత నెలాఖరుకు చూస్తే ఇవి 10 కోట్లను అధిగమించాయి. డిపాజిటరీ సంస్థలైన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండున్నరేళ్ల వ్యవధిలోపే దాదాపు 6 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయంటే.. ఈక్విటీ మార్కెట్లపై మదుపర్లకు ఎంతగా ఆసక్తి పెరిగిందో అర్థమవుతుంది.
లాక్‌డౌన్ సమయం నుంచీ..
కొవిడ్ కేసుల విస్తృతిని తగ్గించేందుకు 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలో స్టాక్‌మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. తదుపరి అనూహ్యంగా పుంజుకున్నాయి. లాక్‌డౌన్ ఫలితంగా సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు రంగాల ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే అవకాశం లేకపోవడం, ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో.. రెండో ఆదాయానికి మార్గంగా స్టాక్‌మార్కెట్ లావాదేవీలపై పలువురు ఆసక్తి పెంచుకున్నారు. బ్యాంకు డిపాజిట్లపై ప్రతిఫలం తగ్గడం, తమ దగ్గర ఉన్న నగదుతో, మొబైల్ ద్వారానే స్టాక్‌మార్కెట్లలో క్రయ విక్రయాలు జరపగలగడం ఇందుకు ఉపకరించింది. స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన స్నేహితులు, సన్నిహితుల్లో కొందరు భారీ లాభాలు ఆర్జించడం చూసి, డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించిన వారే అధికం. పలు పబ్లిక్ ఇష్యూలు కూడా, లిస్టింగ్ రోజే లాభాలు అందించడమూ యువతను ఆకర్షించింది.