తెలంగాణ

telangana

ETV Bharat / business

ముందుగా అప్పు తీర్చలా? పెట్టుబడులు పెట్టాలా? - ఏది బెస్ట్ ఛాయిస్​! - అప్పు త్వరగా తీర్చడం ఎలా

Debt Repayment Vs Investment In Telugu : మీకు చాలా అప్పులు ఉన్నాయా? కానీ భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ముందుగా అప్పులు తీర్చాలా? లేదా పెట్టుబడులు పెట్టాలా? ఏది బెస్ట్ ఛాయిస్​ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Debt Settlement tips
Debt repayment vs investment

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 12:07 PM IST

Debt Repayment Vs Investment : అప్పులు లేకుండా జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే పెట్టుబడులు పెడితే ఆర్థిక లాభాలు వచ్చి, భవిష్యత్​ ఆనందమయం అవుతుంది. కానీ, ఈ రెండింటినీ సాధించడం అంత సులువైన పని కాదు. ఒక వేళ మీకు ఇప్పటికే అప్పులు ఉంటే, ముందు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలా? లేదంటే మీ చేతిలో ఉన్న డబ్బులతో భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టాలా? వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి?

సమస్యలు చెప్పిరావు!
సమస్యలు, అవసరాలు ఎప్పుడూ చెప్పిరావు. పిల్లల చదువులు, ఆసుపత్రి బిల్లులు, ఇంటి మరమ్మతులు, వస్తు, సేవల కొనుగోళ్లు ఇలా రకరకాల ఖర్చుల కోసం చాలా డబ్బులు అవసరం అవుతాయి. అందుకే చాలా మంది ఈ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణం తీసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో పెట్టుబడులను కూడా వాయిదా వేస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? అప్పు తీరుస్తూనే, మదుపు చేసేందుకు ఏవైనా మార్గాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు చూద్దాం.

రుణం తీసుకునే ముందే ఆలోచించాలి?
పర్సనల్​ లోన్​ తీసుకునేటప్పుడు, ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా రుణానికి సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే క్రమపద్ధతిలో అప్పులు తీర్చడానికి, మదుపు చేయడానికి వీలవుతుంది.

  • వడ్డీ రేటు :ఎలాంటి లోన్స్​ తీసుకున్నా, వడ్డీ రేటు మాత్రం కనీస స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ వడ్డీ రేటు వీలైనంత తక్కువగా ఉండాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది.
  • వాయిదాలు : మీరు చెల్లించే రుణ వాయిదాలు అన్నీ కలిపి, మీ మొత్తం ఆదాయంలో 30 శాతానికంటే మించి ఉండకూడదు.
  • వ్యవధి : అప్పు తీసుకునే ముందే, దానిని ఎన్నాళ్లలో తీర్చగలరో అంచనా వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధితో రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన సొమ్మును మదుపు చేయడానికి వీలవుతుంది.

అప్పు త్వరగా తీరాలంటే?
మీ ఆదాయం పెరిగినప్పుడు, బ్యాంకును సంప్రదించి ఈఎంఐ పెంచుకోవాలి. దీని ద్వారా రుణ వ్యవధి, వడ్డీ భారం రెండూ తగ్గుతాయి. ఒక వేళ మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు జమ అయితే, ముందస్తుగానే అప్పు మొత్తాన్ని తీర్చేందుకు ప్రయత్నించాలి. అయితే కొన్ని బ్యాంకులు, ముందస్తుగా రుణం చెల్లించేవారి నుంచి, 5 శాతం వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తుంటాయి. ఈ విషయాన్ని మీరు గమించాలి.

అప్పు తీర్చిన తరువాతనే!
వీలైనంత తొందరగా అప్పు తీర్చాలి. అ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీ దగ్గర కొద్ది మొత్తమే మిగులు ఉంటే, సిప్ విధానంలో మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు.

అప్పు తీసుకుని మదుపు చేయవచ్చా?
కొంత మంది అప్పు తీసుకొని, ఆ డబ్బుతో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది నిజంగా మంచిదేనా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం పలు బ్యాంకులు పర్సనల్​ లోన్స్​పై కనిష్ఠంగా 9.15 శాతం నుంచి గరిష్ఠంగా 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇది చాలా ఎక్కువ వడ్డీ రేటు అని చెప్పకతప్పదు. ఇంత ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుని, పెట్టుబడులు పెడితే నష్టపోక తప్పదు. ఎందుకంటే, నేడు ఇంత ఎక్కువ వడ్డీ రేటును అందించే పొదుపు, మదుపు పథకాలు ఏమీ లేవు.

ఉదాహరణకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు గరిష్ఠంగా 3.5 శాతం వరకు ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లు 3 నుంచి 7.2 శాతం వరకు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు సగటున 11-12 శాతం వరకు రాబడి రావచ్చు. అదే డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే సుమారుగా 7.5 శాతం వరకు ప్రతిఫలం లభించవచ్చు. ఇక్కడ కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈక్విటీలు, డెట్‌ ఫండ్​ పెట్టుబడులు పూర్తిగా రిస్క్​తో కూడుకున్నవి. కనుక భారీ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్స్ తీసుకుని, ఆ డబ్బును పెట్టుబడులకు మళ్లించడం ఏ మాత్రం మంచి ఆలోచన కాదు. మీకు ఇప్పటికే వేరే అప్పులు ఉంటే, వాటిని ముందే తీర్చేయాలి. ఆ తరువాత మాత్రమే పెట్టుబడులు గురించి ఆలోచించాలి.

కొన్నిసార్లు ముందస్తుగా వ్యక్తిగత రుణం తీర్చడం సాధ్యం కాకపోవచ్చు. బ్యాంకు నిబంధనల ప్రకారం, నిర్దిష్ట వ్యవధి తరువాత మాత్రమే లోన్​ తీర్చాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, మీ దగ్గర ఉన్న సొమ్మును లిక్విడ్‌ ఫండ్లలో, స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయాలి. వీటి ద్వారా వచ్చిన రాబడిని, మీ రుణాలను తీర్చడానికి ఉపయోగించాలి.

మెడిక్లెయిమ్ Vs హెల్త్ ఇన్సూరెన్సు - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​?

72 గంటల్లోనే రూ.7200 కోట్ల విలువైన ఫ్లాట్లు సేల్​- ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details