Damaged Currency Exchange : నగదు లావాదేవీలు జరిపినప్పుడు, చాలా మటుకు పాడైపోయిన లేదా చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నోట్లతో ఏదైనా కొనాలని చూస్తే, దుకాణదారులు ఆ పాడైపోయిన కరెన్సీ నోట్లని తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు.. చిరిగిన నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇవ్వడానికి కమీషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇలా ఎవరికీ కమీషన్ చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి.. పాత లేదా చిరిగిన లేదా పాడైపోయిన నోట్లు ఇచ్చి, కొత్త నోట్లు పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కు వెళ్ళి, మీ పాత లేదా పాడైన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఏ బ్యాంక్ కూడా నోట్ల మార్పిడిని నిరాకరించడానికి వీలు లేదు. కరెన్సీ నోట్ల బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలని రూపొందించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్ల మార్పిడికి ఉన్న నియమాలు ఏమిటి?
Torn Currency Exchange : ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకసారికి కేవలం 20 నోట్లు మాత్రమే మార్చుకోగలరు. అంటే, మీరు 20 కంటే ఎక్కువ నోట్లని ఒకేసారి మార్చుకోలేరు. అంతేకాకుండా ఆర్బీఐ చిరిగిన నోట్ల విలువ మీద కూడా ఒక పరిమితి విధించింది. మీరు ఒకేసారి 20 నోట్లను మార్పిడి చేసినా.. దాని గరిష్ఠ విలువ రూ.5000 మించకూడదు. సాధారణంగా పరిమితిలోపు పాడైన కరెన్సీ నోట్లను బ్యాంకులు స్వీకరించి.. ఆ విలువకి సరిపడా కొత్త నోట్లని వెంటనే ఇస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ నోట్లు ఉంటే.. బ్యాంక్ వెంటనే మార్పిడి చేయదు. ముందుగా మీ పాత నోట్లని స్వీకరించి.. తరువాత ఆ డబ్బుని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.