cyrus mistry biography : దేశంలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుల్లో ఒకరైన సైరస్ పల్లోంజీ మిస్త్రీ హఠాన్మరణం, ఈ గ్రూప్‌కే కాక వ్యాపార ప్రపంచానికే తీరనిలోటని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నారు. గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్ 28న మరణించగా, ఇప్పుడు సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. పదేళ్ల క్రితం టాటా గ్రూప్ ఛైర్మన్ పదవిని స్వీకరించడంతోనే సైరస్ మిస్త్రీ దేశీయంగా సామాన్యుల్లో సైతం ప్రాచుర్యం పొందారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఎంపికే కాదు.. ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించిన విధానం కూడా కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2012 డిసెంబరు 28న రతన్ టాటా వారసుడిగా టాటా సన్స్ ఛైర్మన్‌గా 44 ఏళ్ల చిన్న వయస్సులోనే మిస్త్రీని ఎంపిక చేసినప్పుడు కార్పొరేట్ ప్రపంచం అచ్చెరువొందింది. 2016 అక్టోబరు 24న ఆ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికిన తీరూ పెను సంచలనమే.
1994లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను సైరస్ మిస్త్రీ స్వీకరించారు. 2001 సెప్టెంబరు 1న టాటాసన్స్ బోర్డులో చేరారు. 2011 నవంబరు కల్లా టాటా గ్రూప్‌లో 18.4 శాతంతో అతిపెద్ద వాటాదారుగా సైరస్ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ మారారు. అప్పుడే టాటా గ్రూప్ డిప్యూటీ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియమితులవ్వడంతో, తమ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కార్యకలాపాల నుంచి తప్పుకున్నారు. 2012లో రతన్ టాటా వారసుడిగా టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టేందుకు తొలుత మిస్త్రీ సుముఖత చూపలేదు.
రతన్ టాటా చొరవతో
అయితే తమ కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన రతన్ టాటా స్వయంగా వెళ్లి మాట్లాడటంతో ఒప్పుకున్నారు. టాటా గ్రూప్ సంస్థల నిర్వహణ తీరులో వినూత్న మార్పులు చేసే క్రమంలో, నాలుగేళ్లలోనే పరిస్థితులు మిస్త్రీకి వ్యతిరేకమయ్యాయి. ఫలితంగా టాటా గ్రూప్ తన ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది. టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం బాంబే హౌస్‌లో సైరస్ మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీకి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన్ను అక్కడ 'ఫాంటమ్ ఆఫ్ బాంబే హౌస్'గా వ్యవహరించేవారు. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరాటం చేసినా, ఈ విషయంలో తండ్రి నుంచి తగిన మద్దతు లభించలేదనే చెబుతారు. తనను ఛైర్మన్ పదవి నుంచి ఎందుకు తొలగించారో కారణాలు చెప్పాలని టాటాలను మిస్త్రీ కోర్టుకు లాగారు.
టాటా గ్రూప్‌తో ఆరేళ్లుగా..
ఛైర్మన్ పదవి నుంచి తొలగించాక గ్రూప్ వ్యవస్థాపకుడు రతన్ టాటా, మేనేజింగ్ ట్రస్టీ ఎన్.వెంకట రమణన్ సహా ఉన్నతాధికారులపై మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపును సవాల్ చేస్తూ.. 2016 డిసెంబరులో మిస్త్రీ, ఆయన రెండు కుటుంబ నిర్వహణ సంస్థలు సైరస్ ఇన్వెస్ట్‌మెంట్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. 2018 జులై 9న ఈ పిటిషన్‌లను కొట్టివేసిన ఎన్‌సీఎల్‌టీ, మిస్త్రీ తొలగింపును సమర్థించింది. ఈ తీర్పుపై జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో మిస్త్రీ సవాల్ చేశారు.
2019 డిసెంబరులో మిస్త్రీకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎస్‌సీఎల్‌ఏటీ.. ఆయన్ను మళ్లీ టాటా సన్స్ ఛైర్మన్ పదవిలో నియమించాల్సిందిగా ఆదేశించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను 2020 జనవరిలో సుప్రీంకోర్టులో టాటా సన్స్ సవాల్ చేసింది. 2021 మార్చిలో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయగా, మిస్త్రీ రివ్యూ పిటిషన్ వేశారు. ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చడంతో ఆరేళ్ల మిస్త్రీ- టాటా గ్రూప్ న్యాయ వివాదానికి తెరపడింది. అయితే అంతకుముందు తీర్పు సందర్భంలో, తనపై చేసిన వ్యాఖ్యలు ప్రతిష్ఠకు భంగకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ మిస్త్రీ కోరగా, ఆ వ్యాఖ్యలను మాత్రం సుప్రీంకోర్టు తొలగించింది.