Online Car Insurance : ప్రతి వాహనదారుడి దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన పత్రాల్లో వాహన బీమా ఒకటి. ఇది వాహనం ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదానికి గురై దెబ్బతిన్నప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే వెహికిల్ ఇన్సూరెన్స్‌లలో ప్రధానంగా చెప్పుకోవాల్సిది కారు ఇన్సూరెన్స్ కొనుగోళ్ల గురించి. ఈ కారు బీమాల విక్రయాలు మనకు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ పద్ధతిల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని కొనేందుకు కొందరు మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వెహికిల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. మరికొందరేమో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువశాతం ప్రజలు మాత్రం ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్‌లోనే బీమాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న అంశం కనక క్లిక్ చేసేటప్పుడు తెలియకుండా ఏ చిన్న పొరపాటు చేసినా మనకే నష్టం అనే ధోరణిలో ఉండటమే ఆన్‌లైన్‌లో ఎక్కువగా బీమాలు కొనుగోలు చేయకపోవడానికి కారణమని అంటున్నారు వాహన బీమా ఏజెంట్లు. కానీ, ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్‌లను కొనడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. అవి..
సౌకర్యవంతం..!
Online Car Insurance Benefits : ఆన్‌లైన్‌లో అనేక వాహన బీమా సంస్థలు వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్స్‌తో కారు ఇన్సూరెన్స్‌లను అందిస్తున్నాయి. అలా మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల పాలసీలను ఒకదానితో ఒకటి బేరీజు వేసుకొని మన ఆర్థిక శక్తిని బట్టి మనకి కావాల్సిన పాలసీని ఎంచుకునే వీలు ఆన్‌లైన్ విధానం కల్పిస్తుంది. మనకి కావాల్సిన సమయానికి వీటిని కొనుగోలు చేయవచ్చు.
సమయం ఆదా..!
Vehicle Insurance Benefits : ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బీమాను కొనుగోలు చేయడమంటే గంటల తరబడి మన సమయాన్ని వృథా చేసుకోవడమే. అదే ఆన్‌లైన్ విధానంలో కారు ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా చాలా వరకు మన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం మొబైల్ ఫోన్ కంటే ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తే సులువుగా కొద్ది నిమిషాల్లోనే పని పూర్తవుతుంది.
ఆప్షన్స్..!
కారు ఇన్సూరెన్స్లకు సంబంధించి వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వివిధ బీమా ఏజెంట్లు అందించే కవరేజీ, ప్రీమియం చెల్లింపులతో పాటు అదనపు సేవలను కూడా ఇతర కంపెనీలతో కంపేర్ చేసుకొని మనకు ఉపయోగపడే బీమాను ఎంచుకోవచ్చు. అలా వివిధ కంపెనీలు అందించే ప్లాన్లు కొనాలా.. వద్దా అనే పూర్తి అధికారం మనకే ఉంటుంది.