Critical Illness Insurance Policy : రాజీవ్ ప్రముఖ కంపెనీలో సేల్స్ మేనేజర్. తన బృందాన్ని సమర్థంగా నడిపిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడి అతన్ని ధూమపానానికి అలవాటు చేసింది. ఒకరోజు ఉదయం రాజీవ్ పనిలో ఉండగానే అకస్మాతుగా కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేనప్పటికీ పక్షవాతం వచ్చినట్లు వైద్యులు చెప్పారు. అతని శరీరం ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. తను పని చేస్తున్న కంపెనీ నుంచి బృంద బీమా సౌకర్యం ఉంది. అది చికిత్స ఖర్చులను మాత్రమే చెల్లిస్తుంది. ఇప్పుడు రాజీవ్‌కు నిరంతర వైద్య చికిత్స అవసరం. ఉద్యోగం కొనసాగించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అతని కుటుంబానికి ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు వచ్చాయి.
ఇటీవల ఇలాంటి సమస్యలు చాలామందిలో చూస్తున్నాం. గుండెపోటు, క్యాన్సర్, పక్షవాతం, కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇలా జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు చికిత్సకు పరిహారం చెల్లించినా.. ఆ తర్వాత అయ్యే వైద్య ఖర్చులకు ఇది ఏమాత్రం సరిపోకపోవచ్చు. ప్రత్యేకించి, దీర్ఘకాల చికిత్స అవసరమయ్యే వ్యాధుల విషయంలో ఆర్థిక వ్యయం తట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఇలాంటి సందర్భాల్లోనే క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు ఆర్థికంగా రక్షణగా ఉంటాయి.
ఎలా పనిచేస్తాయంటే..
ప్రాణాంతకమైన తీవ్ర వ్యాధులను ప్రాథమికంగా నిర్ధరించినప్పుడే క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ ఒకేసారి పరిహారాన్ని చెల్లిస్తుంది. చాలా క్రిటికల్ కేర్ హెల్త్ పాలసీలు కనీస బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి అందిస్తున్నాయి. గరిష్ఠ పరిమితి బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. ఈ పాలసీలు చెల్లించే పరిహారం వల్ల ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక అయ్యే వైద్య ఖర్చులను సులభంగా తట్టుకునేందుకు వీలవుతుంది. బీమా చేసిన వ్యక్తి చికిత్స ఖర్చులకు భయపడాల్సిన అవసరం ఉండదు. బీమా కంపెనీలు సాధారణంగా తీవ్ర వ్యాధులను కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తాయి. ఒక్కో విభాగం కింద 100 శాతం బీమా మొత్తాన్ని క్లెయిం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు విభాగాల్లో ఈ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
- క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీలు, బైపాస్ శస్త్రచికిత్స, గుండె మార్పిడి, కార్డియోమయోపతి, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌వంటి గుండె సంబంధిత వ్యాధులు
- మెదడు, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, కోమా, అల్జీమర్స్ తదితరాలు
- అంధత్వం, చెవుడు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర కీలక అవయవాల వ్యాధులు