తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రికెట్‌ నేర్పే ఆర్థిక పాఠాలు.. ఇలా చేస్తే భవితకు ధీమా! - పెట్టుబడి ప్రణాళిక టిప్స్ అండ్ ట్రిక్స్

క్రికెట్‌.. పదకొండు మంది క్రీడాకారులు మైదానంలో ఆడుతుంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. మన జట్టే విజయం సాధించాలని కోరుకుంటారు. సరైన ఆటగాళ్ల కూర్పు, వ్యూహ-ప్రతివ్యూహాలే ఇక్కడ విజయ రహస్యం. టీ20 ప్రపంచ కప్పు నేపథ్యంలో అందరూ ఈ ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నారు. క్రికెట్‌ను చూస్తూ ఆనందించడమే కాదు.. అది మనకు కొన్ని ఆర్థిక పాఠాలూ నేర్పుతుందని గుర్తించాలి. అవేమిటో తెలుసుకుందామా..

personal finance planning india
క్రికెట్‌ నేర్పే ఆర్థిక పాఠాలు.. ఇలా చేస్తే భవితకు ధీమా!

By

Published : Oct 28, 2022, 10:12 AM IST

ట ఏదైనా విజయమే అంతిమ లక్ష్యం. ఆటలో నియమ నిబంధనలు ఎన్నో ఉంటాయి. జాగ్రత్తలూ తీసుకోవాలి. 'టీవీలో చూసేటప్పుడు క్రికెట్‌ చాలా తేలిగ్గానే కనిపిస్తుంది. కానీ, మైదానంలో ఏదీ తేలిక కాదు. మెదడును ఉపయోగిస్తూ.. కచ్చితమైన అంచనాలతో ఆడాల్సిందే' ఒక సందర్భంలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్న మాటలివి. పెట్టుబడులూ అంతే. ఏమంత పెద్ద విషయం కాదన్నట్లే అనిపిస్తాయి. ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని చేరుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోతే విజయం సాధించడం అంత తేలిక కాదు. క్రికెట్‌లో అనుసరించే వ్యూహాలు.. ఆర్థిక అంశాలకూ దగ్గరగా ఉంటాయి.

జట్టు కూర్పు బాగుంటేనే..
జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్ల కూర్పు బాగున్నప్పుడే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందరూ బ్యాట్స్‌మెన్‌ లేదా బౌలర్లే ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే వైవిధ్యంగా ఉండాల్సిందే. పెట్టుబడుల విషయమూ అంతే. ఒకే తరహా పథకాలపై ఆధారపడితే ఎప్పటికీ అనుకున్నది సాధించలేం. వీలైనంత వరకు పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలి. షేర్లు, బాండ్లు, ఫండ్లు, బంగారం ఇలా పలు పథకాలు ఎంచుకోవాలి. ఒకే బ్యాట్స్‌మన్‌పై ఎక్కువగా ఆధారపడటమూ జట్టుకు మంచిది కాదు. ఇదే విధంగా ఈక్విటీల్లో ఏదో ఒక షేరుపైనే మొత్తం పెట్టుబడిని కేటాయించడమూ నష్టభయాన్ని పెంచుతుంది. సరైన వ్యూహంతో వృద్ధి చెందే రంగాల్లోని కంపెనీల షేర్లు, ఈక్విటీ ఫండ్లు, వివిధ వ్యవధుల బాండ్లు, డిపాజిట్లను ఎంచుకోవడం మంచిది.

వికెట్‌ను రక్షించుకుంటూ..
వికెట్‌ను కాపాడుకోవడం.. క్రికెట్‌లో ఎంతో కీలకమైన వ్యూహం ఇది. మైదానంలో నిలదొక్కుకుంటేనే బాగుంటుంది. కానీ, పరుగులు తీయకుండా పూర్తి రక్షణాత్మక ధోరణితో ఆడుతుంటే జట్టుకు అన్యాయం జరుగుతుంది. విలువైన బంతులు వృథా అయిపోతాయి. మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉండాలని భావిస్తూ మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో సాధించేదేమీ ఉండదు. ద్రవ్యోల్బణం రాబడులను హరించి వేస్తుంది. కేవలం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలనే నమ్ముకుంటే ఫలితం కనిపించదు. మన కష్టార్జితానికి నష్టాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. అదే సమయంలో రాబడినీ ఆర్జించేలా పథకాలను ఎంచుకోవాలి. వికెట్‌ను కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టడం.. ఇదే వ్యూహం పెట్టుబడులకూ వర్తింపచేయాలి. మన డబ్బును రక్షించుకుంటూనే లాభాలనూ అందుకోవాలి.

అవకాశాలను వదులుకోవద్దు..
పొట్టి క్రికెట్‌లో పవర్‌ప్లే ఓవర్లు చాలా ముఖ్యం. ఫోర్లు, సిక్సర్లు బాదేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అనుకోని లైఫ్‌లు ఆటను మళ్లీ గాడిన పెట్టుకునేందుకు ఒక అవకాశాన్ని ఇస్తాయి. పెట్టుబడుల విషయంలో మనకు ఎన్నో అవకాశాలు లభిస్తుంటాయి. కొన్నిసార్లు మార్కెట్‌ పతనం అవ్వడం వల్ల మంచి షేర్లూ అందుబాటు ధరలోకి రావచ్చు. భవిష్యత్తులో వాటి ధర పెరిగే వీలుంటుందని భావిస్తే వాటిని వదులుకోవద్దు. మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉన్నప్పుడే నేరుగా షేర్లను ఎంపిక చేసుకోవాలి. పిచ్‌ను పరిశీలించి ఆట తీరును మార్చుకున్నట్లు.. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పనితీరు, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇలా ఎన్నో అంశాలకు ఆయా షేర్లు ఎలా ప్రభావితం అవుతాయన్నది గమనించాకే నిర్ణయం తీసుకోవాలి.

లక్ష్యం మర్చిపోకుండా..
20 ఓవర్లలో 220.. ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. పరుగులు రాబట్టడమే లక్ష్యంగా హిట్టింగ్‌ను ఎంచుకుంటారు. ఓపిక లేకుండా తొందరపాటుతో వికెట్‌ను సమర్పించుకుంటారు. చాలామంది మదుపరులు ఇలాంటి పొరపాటే చేస్తుంటారు. ఆర్థిక లక్ష్యం ఏమిటన్నది పట్టించుకోకుండా అధిక రాబడులను ఆర్జించడమే లక్ష్యంగా ట్రేడింగ్‌ లేదా ఇతర మార్గాలను ఎంచుకుంటారు. ఫలితంగా లాభాలు రాకపోగా పెట్టుబడినీ నష్టపోతుంటారు. లక్ష్యం భారీగా ఉన్నప్పుడు.. క్రమశిక్షణతో ఉంటూ.. ఒక్కో ఓవర్‌కు ఇన్ని పరుగులు అని స్థిరంగా సాధించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. పెట్టుబడులూ అంతే. అవసరమైన మొత్తాన్ని సాధించేందుకు క్రమానుగత పెట్టుబడులను కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలవుతుంది.

ఇవీ ముఖ్యమే..

  • టీ20లో తొలి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. ఇదే విధంగా సంపాదన ప్రారంభించిన వెంటనే వీలైనంత మదుపు చేసే ప్రయత్నం చేయాలి.
  • ఒక చెత్త ఓవర్‌ ఆటను మలుపు తిప్పుతుంది. ఇదే తరహాలో మీ పెట్టుబడుల్లో పనితీరు బాగాలేని ఒక పథకం ఉంటే.. మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది. అలాంటి పథకాలను గుర్తించి, తొలగించే ప్రయత్నం చేయండి.
  • ఆడేటప్పుడు ఎన్నో అంశాలు క్రీడాకారుల దృష్టిని మరలుస్తుంటాయి. కానీ, వారి లక్ష్యం ఎప్పుడూ మారదు. ఇదే విధంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు వచ్చే అవాంతరాలను పట్టించుకోకుండా లక్ష్యం చేరుకునే వరకూ ఓపిక పట్టాలి.
  • లక్ష్యానికి చేరువైనప్పుడు.. దూకుడుగా కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. ఇదే తీరుగా అనుకుంటున్న మొత్తం సమకూరినప్పుడు నష్టభయం ఉన్న పథకాల నుంచి సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మార్చుకోవాలి.
  • జట్టు సభ్యులందరితో కలిసి కోచ్‌ ఒకసారి మ్యాచ్‌ను సమీక్షిస్తారు. ఇలాగే పెట్టుబడులనూ అప్పుడప్పుడూ సమీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.
  • మైదానంలో ఆడేది 11 మందే అయినా.. జట్టులో మొత్తం 15 మంది ఉంటారు. అంటే అదనంగా మరో నలుగురు ఉంటారు. అలాగే మన దగ్గరా ఆరు నుంచి ఏడాది ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి అందుబాటులో ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details