Credit Score VS Credit Report : క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్.. వినటానికి రెండూ దాదాపు ఒక్కలాగే ఉంటాయి. కానీ వీటి మధ్య స్పష్టమైన భేదం ఉంది. క్రెడిట్ స్కోర్ అనేది కేవలం ఒక మూడు అంకెల సంఖ్య. ఇది ఓ వ్యక్తి ఆర్థిక స్థితిని మాత్రమే అంచనా వేయగలదు. కానీ క్రెడిట్ రిపోర్ట్ అనేది సదరు వినియోగదారుడి మొత్తం ఆర్థిక లావాదేవీల చిట్టాను, అతని ఆర్థిక స్థితి గురించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటుంది. వీటి గురించి మరింత విశ్లేషణాత్మకంగా ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
What Is Credit Score : క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. క్రెడిట్ కార్డులు వాడే ప్రతిఒక్కరికీ బాగా పరిచయమున్న పదం. ఎందుకంటే దీని ఆధారంగానే రుణసంస్థలు లేదా బ్యాంకులు తమ వినియోగదారులకు రుణాలను మంజూరు చేస్తాయి. అంతే కాకుండా సదరు వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే సాధారణంగా ప్రతి ఒక్కరికీ క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉంటుంది.
క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏమిటి?
What Is Credit Report :క్రెడిట్ రిపోర్ట్ అనేది ఒక వ్యక్తికి సంబంధిచిన పూర్తి ఆర్థిక వ్యవహారాల సమగ్ర నివేదిక. ఇందులో వినియోగదారుడి క్రెడిట్ ఖాతాల వివరాలు, పేమెంట్స్ హిస్టరీ, రుణసంస్థలకు బాకీ ఉన్న బ్యాలెన్స్‌లు, క్రెడిట్ పరిమితులు, క్రెడిట్ రకాలు, ఆలస్య చెల్లింపులు, డీఫాల్ట్‌లు, దివాలాలు లాంటి పూర్తి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా రుణదాతలు అందించే సమాచారం లేదా పబ్లిక్ రికార్డుల ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు ఈ క్రెడిట్ నివేదికలను తయారు చేస్తాయి.
రెండింటికీ తేడా ఏంటి..?
Credit Report VS Credit Score :క్రెడిట్ స్కోర్ అనేది ఓ మూడు అంకెల సంఖ్య. ఇది ఓ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక స్థితిని, రుణార్హతను తెలియజేస్తుంది. కానీ క్రెడిట్ రిపోర్ట్ అనేది ఒక సమగ్ర నివేదిక. ఇందులో సదరు వ్యక్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర సమాచారం ఉంటుంది. ఈ నివేదికను ఆధారం చేసుకునే క్రెడిట్ బ్యూరో సంస్థలు.. క్రెడిట్ స్కోర్‌ను అందిస్తాయి. ఈ రెండింటినీ ఆధారంగా చేసుకునే మీ రుణార్హతను బ్యాంకులు లేదా రుణ సంస్థలు నిర్ణయిస్తాయి.
క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే మంచిది..?
Good Credit Score :మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ 800పైన ఉంటే.. అద్భుతంగా ఉందని అర్థం. 700-800 మధ్య ఉంటే బాగుంది అని అర్థం. 600-700 మధ్య ఉంటే.. ఫర్వాలేదు కానీ జాగ్రత్త వహించాలి అని అర్థం. క్రెడిట్ స్కోర్ 600 కన్నా తక్కువగా ఉంటే.. ప్రమాదకర స్థాయిలో మీ ఆర్థిక స్థితి ఉందని అర్థం. ఇలాంటి స్కోర్ కలిగిన కస్టమర్స్‌కు లోన్స్ అంత సులువుగా లభించవు.
క్రెడిట్ స్కోర్ చెకింగ్‌కు రుసుము చెల్లించాలా?
Credit Score Free Report :మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా క్రెడిట్ బ్యూరోల నుంచి లేదా క్రెడిట్ స్కోర్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంల ద్వారా చెక్ చేసుకోవచ్చు. అయితే చాలా వరకు క్రెడిట్ బ్యూరోలు ఈ సేవలను ఏడాదికి ఒక్కసారి మాత్రమే తమ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నాయి. ఆపై క్రెడిట్ స్కోర్ చెకప్ కోసం నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నాయి.
ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం ఎలా?
Credit Score Free Check :ప్రస్తుతం చాలావరకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా చెక్‌చేసుకునే వీలును కల్పిస్తున్నాయి. పరిమితి దాటిన తర్వాత చేసే క్రెడిట్ స్కార్ చెకింగ్‌లకు ఛార్జ్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు.. ఏడాది పొడవునా ఉచితంగా ఎన్నిసార్లైనా సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీ చెకింగ్ పేరుతో కొందరు సైబర్ కేటుగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను సేకరించి దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుంది. అందుకే విశ్వసనీయమైన, సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు.