How to increase credit score: రుణాల వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బ్యాంకులూ క్రెడిట్ స్కోరు ఆధారిత వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 750కి మించి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేట్లలో 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేరకు రాయితీని అందిస్తున్నాయి. సులభంగా రుణాలను పొందడంలోనూ ఈ స్కోరు ఎంతో కీలకంగా మారుతోంది. కొత్తగా సంపాదన మొదలు పెట్టిన వారికి, ఇప్పటివరకు రుణాలు తీసుకోని వారికీ క్రెడిట్ స్కోరు ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థలు బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ రుణాలను తీసుకోవడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకోవడం ప్రారంభించవచ్చు.
క్రెడిట్ కార్డుతో లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లే పరిగణించవచ్చు. రుణాలకు వడ్డీ విధిస్తారు. కానీ, వ్యవధిలోపు కార్డు బిల్లు పూర్తిగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. అన్ని క్రెడిట్ బ్యూరోలూ క్రెడిట్ కార్డు వ్యవహారాలను నమోదు చేస్తాయి. కాబట్టి, క్రమం తప్పకుండా.. గడువు లోపు బిల్లులు చెల్లించినప్పుడు మీ క్రెడిట్ స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో రాయితీలు, ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. 3-5 శాతం వరకు నగదు వాపసులాంటి ప్రయోజనాలనూ అందిస్తుంది. ఇలాంటి ప్రయోజనాల కోసం కార్డును వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు మనకు అవసరం లేని వస్తువులనూ కొనే ప్రమాదం ఉంది. సకాలంలో ఈ బిల్లులు చెల్లించకపోతే.. స్కోరు దెబ్బతింటుంది.
EMI credit score:వివిధ ఉత్పత్తులు, సేవలను అందించే సంస్థలతో క్రెడిట్ కార్డు కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. ఆయా ఉత్పత్తులు, సేవలకు కార్డుల ద్వారా చెల్లించినప్పుడు సున్నా శాతం వడ్డీతో వాయిదాల్లో చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తాయి. కొత్తగా సంపాదన ప్రారంభించిన వారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. అయితే, అంతగా అవసరం లేని వస్తువులను ఈ విధానంలో కొనకూడదు. ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కసారి చెల్లించకపోయినా క్రెడిట్ స్కోరుపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పైగా రుసుములు, వడ్డీలు అదనంగా భరించాలి. బ్యాంకు ఖాతాలో బిల్లుకు సరిపడా డబ్బు ఉన్నప్పుడే క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేయడం మేలని ఆర్థిక నిపుణుల సూచన.