తెలంగాణ

telangana

ETV Bharat / business

Credit Card Usage Tips : సిబిల్ స్కోర్ పెరగాలా?.. క్రెడిట్ కార్డును వాడండి ఇలా! - క్రెడిట్ కార్డ్ టిప్స్​

Credit Card Usage Tips In Telugu : క్రెడిట్​ కార్డ్​ ఉంది కదా అని.. దానిపై ఉన్న పరిమితి మొత్తాన్ని వాడేస్తున్నారా? అయితే మీ క్రెడిట్​ స్కోర్​పై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందుకే మీ క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించుకోవాలి? క్రెడిట్ స్కోర్​ను ఎలా పెంచుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card Usage Tips
How to use credit card for maximum benefit

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 4:43 PM IST

Credit Card Usage Tips :లోన్​ సులభంగా లభించాలంటే మంచి క్రెడిట్‌ స్కోరు ఉండాల్సిందే. మీరు తీసుకున్న రుణాన్ని సరిగ్గా చెల్లిస్తున్నారా? ఎన్ని ఏళ్ల నుంచి అప్పులు తీసుకుంటున్నారు? రుణాల మిశ్రమం, కార్డు బిల్లులు సకాలంలోనే చెల్లిస్తున్నారా? లేదా? ఇలా అనేక అంశాలు క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తాయి. వీటితో పాటు క్రెడిట్​ కార్డును ఒక పరిమితిలోపు ఉపయోగిస్తున్నారా? లేదా? అనేది కూడా క్రెడిట్​ స్కోరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

అతిగా వాడొద్దు!
ఈ మధ్యకాలంలో చాలా మంది క్రెడిట్‌ కార్డును వాడుతున్నారు. అయితే కార్డు ఉంది కదా అని ప్రతినెలా ఇష్టం వచ్చినట్లు వాడితే ఇబ్బందులు తలెత్తుతాయి. తరచుగా కార్డు వాడుతుండడం, పరిమితికి మించి ఖర్చు చేస్తుండడం లాంటివి మీ క్రెడిట్ స్కోర్​పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తవానికి ఇలా పరిమితికి మించి క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే.. మీరు అప్పులపై అధికంగా ఆధారపడుతున్నట్లు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు బ్యాంకులు, రుణ సంస్థలు భావిస్తాయి. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఉదాహరణకు.. ఓ వ్యక్తి క్రెడిట్‌ కార్డు పరిమితి 2లక్షల రూపాయల వరకు ఉందనుకుందాం. అప్పుడు అతను రూ.2 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనుగోళ్లు జరపవచ్చు. కానీ ఇందులో 30 శాతం అంటే.. రూ.60 వేల లోపే మీ కొనుగోళ్లు ఉండేలా జాగ్రత్తపడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 40 శాతం వరకూ కార్డ్​ను వినియోగించాలి. అది కూడా గడువు తేదీ లోపే బిల్లులను పూర్తిగా చెల్లించగలనని నమ్మకం ఉన్నప్పుడే. ఇక అక్కడి నుంచి వినియోగం పెరుగుతున్న కొద్దీ మీపై ఆర్థిక భారం ఎక్కువవుతుంది. దాంతోపాటు మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి అధికమవుతున్నట్లు లెక్క. దీంతో మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడే 'బాధ్యత గల రుణ గ్రహీత' అని బ్యాంకులు నమ్ముతాయి. రుణాలు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు పెట్టవు.

క్రెడిట్ బ్యూరోలు ఏం చూస్తాయి?
క్రెడిట్ బ్యూరోలు.. వ్యక్తుల క్రెడిట్​ స్కోరు గణనకు వేర్వేరు విధానాలను, పారామితులను ఉపయోగిస్తూ ఉంటాయి. రుణ వినియోగ నిష్పత్తి 30 శాతం కంటే తక్కువే ఉండాలని కొన్ని బ్యూరోలు అంటాయి. మరికొన్ని మాత్రం 35-40 శాతం వరకూ ఉన్నా ఇబ్బంది లేదని చెబుతుంటాయి. కానీ, రుణ వినియోగ నిష్పత్తి ఎప్పుడూ 25-30 శాతం లోపే ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు పరిమితి లక్ష రూపాయలు ఉన్నట్లయితే.. ప్రతి నెలా రూ.25వేలకు మించి వాడకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు ఈ విధానాన్ని పాటించేందుకు ప్రయత్నించాలి. పరిమితి లోపే వినియోగం ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో, అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే పరిమితికి మించి కొనుగోళ్లు చేయాలి.

  • ఎల్లప్పుడూ ఖర్చులు పరిమితంగా ఉండేలా చూసుకోండి. అనవసర వ్యయాలు తగ్గించుకోవాలి. క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు తేదీకి ముందే చెల్లించేందుకు ప్రయత్నించాలి.
  • ఎక్కువ క్రెడిట్‌ పరిమితి ఉన్న కార్డులను దుర్వినియోగం చేయవద్దు. వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి.
  • మీ క్రెడిట్‌ పరిమితిని పెంచుకునేందుకు మరో మార్గం ఉంది. మీ కార్డు లిమిట్​ 2 లక్షల రూపాయలు అనుకుందాం. మీరు క్రమం తప్పకుండా 70వేల రూపాయల వరకు వాడుతున్నారని అనుకుందాం. అంటే.. 35 శాతం. ఒకే కార్డుతో అధిక శాతం వినియోగించడం వల్ల క్రెడిట్​ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మరో క్రెడిట్‌ కార్డును కనీసం రూ.1 లక్ష పరిమితితో తీసుకోవాలి. రెండింటినీ కలిపి వాడుకోవాలి. దీంతో వినియోగ నిష్పత్తి తగ్గుతుంది.
  • ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు.. ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లనూ చేయకూడదు. అన్ని కార్డులను వినియోగించేందుకు ప్రయత్నించాలి.
  • క్రెడిట్‌ కార్డులను క్రమం తప్పకుండా వాడుతుంటే.. కనీసం సంవత్సరానికి ఓ సారైన క్రెడిట్‌ స్కోరును చెక్​ చేసుకోవాలి. దీనివల్ల మీ రుణ చరిత్రలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు ఉచితంగానే క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. వాటిని మీరు వినియోగించుకోవచ్చు.

How To Improve CIBIL Score With Credit Cards : సిబిల్ స్కోర్​ పెంచుకోవాలా?.. క్రెడిట్​ కార్డ్​లను ఉపయోగించండిలా!

How To Enable Credit Card Transaction Limit : కొత్త డెబిట్/ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా?.. ట్రాన్సాక్షన్ లిమిట్​ను సెట్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details