తెలంగాణ

telangana

ETV Bharat / business

అవసరానికో క్రెడిట్​ కార్డు.. వాడుకోండిలా!

క్రెడిట్‌ కార్డు... కేవలం చెల్లింపుల సాధనంగానే కాదు.. రివార్డు పాయింట్లు, నగదు వెనక్కి, రాయితీలు ఇలా ఎన్నో ప్రయోజనాలు కల్పించే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో మీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్‌ కార్డు సరిపోతుందో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.

credit card usage for good credit score
credit card usage for good credit score

By

Published : Jan 22, 2023, 8:46 AM IST

ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగానే ఒక వ్యక్తికి క్రెడిట్‌ కార్డు అర్హత లభిస్తుంది. కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ అర్హతల ఆధారంగా ఎంత మొత్తానికి కార్డు అందుతుందో చూసుకోండి. దానికోసమే ప్రయత్నించాలి. అధిక మొత్తం కార్డు కోసం చూస్తే.. తిరస్కరణ ఎదురుకావచ్చు. క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం పడుతుంది.

ఎలా ఖర్చు చేస్తారు?
మీరు కార్డును ఎలా వాడుకుంటారు అనేది కార్డు ఎంపికలో కీలకం. ఉదాహరణకు ఒక వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాడని అనుకుందాం. పెట్రోలుపై నగదు వెనక్కి, అధిక రివార్డు పాయింట్లు అందించే కార్డును పరిశీలించాలి. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు ఎక్కువగా నిర్వహించే వారు.. షాపింగ్‌ వెబ్‌సైట్లు, బ్రాండ్‌లపై రాయితీలు అందించే కార్డును ఎంచుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నగదు వెనక్కి, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు కార్డు నిబంధనలను పూర్తిగా చదవండి. అప్పుడే అవగాహనతో కార్డును వినియోగించగలరు.

గరిష్ఠ పరిమితి ...
క్రెడిట్‌ కార్డుపై అధిక పరిమితి ఉండేలా చూసుకోవాలి. ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా బ్యాంకులు పరిమితిని నిర్ణయిస్తాయి. అయితే, కార్డు పరిమితి మొత్తాన్నీ వాడుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. పరిమితిలో 50 శాతానికి మించి ఉపయోగించకపోవడమే ఉత్తమం. మిగతా 50శాతం అత్యవసరాలు అంటే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంలాంటి సందర్భాల్లో వాడుకునేందుకు అందుబాటులో ఉంచుకోవాలి.

బడ్జెట్‌ ఆధారంగా..
మీ ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు బడ్జెట్‌ వేసుకోవడం మంచిది. అదే విధంగా క్రెడిట్‌ కార్డుపై చేసే ఖర్చులకూ ఒక ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మీరు ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు కార్డును వాడితే 10 శాతం రాయితీ వస్తుంది అనుకోండి.. ఇలాంటప్పుడు నగదుకు బదులుగా క్రెడిట్‌ కార్డును ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించాలి.

కొన్ని బ్యాంకులు కార్డులపై వార్షిక రుసుములు వసూలు చేయడం లేదు. కానీ, దీనికి పరిమితులు ఉంటాయి. ఏడాదికి నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ ప్రయోజనాన్ని కల్పిస్తుంటాయి. క్రెడిట్‌ కార్డును వాడినప్పుడు గడువు తేదీకి ముందే బిల్లులు చెల్లించాలి. క్రమశిక్షణతో వాడుకున్నప్పుడే ఈ కార్డు అందించే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని మర్చిపోవద్దు.

ABOUT THE AUTHOR

...view details