Credit Card Overpay New Rules :క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాంకులు కీలక సూచనలు చేశాయి. దేశంలో సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి.. క్రెడిట్ కార్డుల వినియోగంలో బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొందరు క్రెడిట్ కార్డు వినియోగదారులు.. అప్పు త్వరగా తీరిపోతుందన్న ఉద్దేశంతో.. ఒక్కోసారి చెల్లించాల్సిన నెలవారీ EMI కన్నా ఎక్కువ చెల్లిస్తారు. ఈ పద్ధతిని ఇకపై అంగీకరీంచబోమంటూ బ్యాంకులు చెబుతున్నాయి. మరి, ఎందుకలా చెబుతున్నాయి? దానికి గల కారణం ఏంటి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు (Credit card) హోల్డర్లలో ఎక్కువ మంది.. ఆ నెలలో ఎంత EMI చెల్లించాల్సి ఉంటే.. అంతే పే చేస్తారు. అయితే.. ఆ నెలలో డబ్బులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే.. కొందరు EMI కన్నా ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తారు. అప్పు త్వరగా తీరిపోతుంది కదా అని ఇలా చేస్తారు. అందుకే.. ప్రతినెలా వీలైనంత ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. అయితే.. ఇకమీదట ఇలా అధిక మొత్తంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు అవకాశం ఉండదు.
దీనికి గల కారణమేంటో బ్యాంకులు స్పష్టంగా చెప్పాయి. ఇలాంటి అధిక మొత్తాల చెల్లింపుల వల్ల.. మనీలాండరింగ్, ఇతర మోసాలు జరుగుతున్నట్లు బ్యాంకులు గుర్తించాయి. జనాల బ్యాంకు ఖాతాల్లోంచి కొట్టేసిన సొమ్మును.. ఇతర మోసపూరిత మార్గాల్లో సంపాదించిన డబ్బును.. మోసగాళ్లు క్రెడిట్ కార్డులకు తరలిస్తున్నారట. ఇలా కాజేసిన డబ్బుతో విదేశీ లావాదేవీలు కూడా జరుపుతున్నట్టు బ్యాంకులు గుర్తించాయట. ఈ కారణం వల్లనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాయట.
ఇప్పటికే కొన్ని బ్యాంకులు.. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లించకుండా క్రెడిట్ కార్డు వినియోగదారుల్ని నివారిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. కస్టమర్లను అధిక మొత్తం చెల్లించకుండా నిలువరిస్తున్నాయి. కానీ.. మరికొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారులు.. ఓవర్ పేమెంట్ చేసే అవకాశం ఇంకా ఉన్నట్టు సమాచారం.