విపణిలో ఎక్కడ చూసినా.. రాయితీలు, ఆకర్షణీయమైన ఆఫర్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసినప్పుడు అదనంగా 5-10 శాతం వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కార్డుతో లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేమిటో చూద్దామా...
మీ కార్డు గురించి తెలుసుకోండి:మీ కార్డు పరిమితి ఎంత ఉంది? ఇప్పటికే ఎంత వాడారు? బిల్లు బాకీ ఎంత ఉంది? ఇలాంటి వివరాలు ముందుగా చూసుకోండి. రివార్డు పాయింట్లు ఎన్ని ఉన్నాయి, కార్డు బిల్లింగ్ తేదీలేమిటి అన్నది చూశాకే కొత్త కొనుగోలుకు సిద్ధమవ్వండి. ఇలా పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడే ఏ కార్డును, ఎంత మేరకు ఉపయోగించాలనే స్పష్టత వస్తుంది.
ప్రారంభంలోనే: సాధారణంగా కార్డుతో ఏదైనా కొన్నప్పుడు 30-40 రోజుల వ్యవధి లభిస్తుంది. కార్డు బిల్లింగ్ ప్రారంభంలో వాడినప్పుడే ఈ ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు మీ బిల్లింగ్ తేదీ 8 నుంచి ప్రారంభం అవుతుందనుకుందాం. అప్పుడు 9 -15 తేదీల మధ్య కొనడం వల్ల తగినంత వ్యవధి దొరుకుతుంది.
రాయితీలు వదులుకోవద్దు:కొన్ని బ్రాండ్లు క్రెడిట్ కార్డు సంస్థలతో ఒప్పందం చేసుకొని, సాధారణ డిస్కౌంట్లకు మించి, ప్రత్యేక తగింపులను అందిస్తాయి. పండగల వేళ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రెండు మూడు కార్డులు ఉన్నవారు.. ఏ కార్డుతో ఎక్కువ తగ్గింపు లభిస్తుందో చూసుకోవాలి. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది.