Is credit card EMI good : చాలా మంది క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులను ఈఎంఐల కిందకు మార్చుకుంటారు. ఫలితంగా కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటారు. ముందుగా చెల్లించే బదులు కొన్ని నెలల పాటు వాయిదాల రూపంలో బకాయిలను చెల్లించే వెసులుబాటు ఉండడమే దీనికి కారణం. పూర్తి లేదా పాక్షిక బిల్లును ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. జేబుపై భారం లేకుండా పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయొచ్చు. ఇది సౌకర్యవంతమైన మార్గమైనప్పటికీ.. తప్పనిసరిగా పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఛార్జీలను సరిపోల్చుకోవాలి:క్రెడిట్ కార్డు ఈఎంఐలు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ / ఫోర్‌క్లోజర్ మొదలైన నిర్దిష్ట ఛార్జీలకు లోబడి ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు 0-3 శాతం వరకు ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే చెల్లించాలి. కాలపరిమితికి ముందే పూర్తిగా లేదా పాక్షికంగా రుణం చెల్లించాలనుకుంటే ముందస్తు చెల్లింపు ఛార్జీలు వర్తిస్తాయి. ఈఎంఐలపై కూడా వడ్డీ ఉంటుంది. ఇవన్నీ కార్డు జారీ చేసే సంస్థలు, కార్డు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీకు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే.. వాటి మధ్య ఛార్జీలను సరిపోల్చుకోవాలి. దేంట్లో తక్కువ రుసుములు ఉంటే వాటిని ఈఎంఐ చెల్లింపులకు ఎంచుకోవాలి.
అనువైన కాలపరిమితిని ఎంచుకోవాలి:
సాధారణంగా, క్రెడిట్ కార్డు జారీ చేసేవారు రుణ కాలపరిమితి ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తారు. అయితే, సుదీర్ఘ కాలపరిమితిని ఎంచుకునేటప్పుడు.. ముందుగా ఆ వ్యవధిలో చెల్లించే వడ్డీ మొత్తాన్ని లెక్కించాలి.
ఉదాహరణకు..
మీరు రూ.10,000 క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకున్నారనుకుందాం. ఇక్కడ 3 నెలల కాలవ్యవధికి వడ్డీ రేటు 20 శాతం. అదే 12 నెలలకు ఇది 18 శాతం. అప్పుడు మీరు దిగువన తెలిపిన విధంగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
- 3 నెలల ప్లాన్‌పై చెల్లించే వడ్డీ : రూ.335; నెలకు రూ.3,445 ఈఎంఐ చెల్లించాలి.
- 12 నెలల ప్లాన్‌పై చెల్లించే వడ్డీ: రూ.1,002; నెలకు రూ.917 ఈఎంఐ చెల్లించాలి.