చాలామంది కొత్త రుణగ్రహీతలకు క్రెడిట్ స్కోరు ఉండదు. క్రెడిట్ కార్డులూ ఉండవు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకొని, ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ (బయ్ నౌ, పే లేటర్) సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికిప్పుడు డబ్బుతో అవసరం లేకుండా.. ఇప్పుడు కొని, నిర్ణీత వ్యవధిలోగా చెల్లించడమే ఈ బీఎన్‌పీఎల్. యాప్‌లలో ముందుగానే రుణ పరిమితి నిర్ణయిస్తారు. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మీ రుణ పరిమితి మేరకు చెల్లిస్తారు. 15-45 రోజుల్లోగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా రుసుములు తప్పవు. పైగా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
సాధారణంగా క్రెడిట్ కార్డులు ఉద్యోగులు, క్రెడిట్ స్కోరు బాగున్న వారికి ఇస్తుంటాయి బ్యాంకులు. దీనితో చెల్లించినప్పుడు 45-50 రోజుల వరకూ వ్యవధి లభిస్తుంది. ఆలస్యం చేసినప్పుడు గరిష్ఠంగా 45 శాతం వరకూ వార్షిక వడ్డీ వసూలు చేస్తాయి.
ముందే అనుకున్నట్లు బీఎన్‌పీఎల్ సంస్థలు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరును పట్టించుకోవు. అందుకే, ఇటీవల కాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. కానీ, చెల్లింపులు ఆలస్యం చేస్తే మాత్రం ఇవి క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తాయి. ఒక్కసారి స్కోరు తగ్గితే.. పెంచుకోవడం కష్టమవుతుంది.