తెలంగాణ

telangana

ETV Bharat / business

కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్​ గురించి తెలుసా? మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? - కస్టమర్​ హక్కులు

Consumer Protection Act In Telugu : నిత్యావసర సరకుల్లో కల్తీలు, అధిక ధరలు, ఆర్థిక మోసాలు ఇలా వినియోగదారులు నిత్యం ఏదో ఒక రూపంలో మోసపోతున్నారు. మరోవైపు ఈ-కామర్స్​ పెరుగుతున్నందున ఆన్‌లైన్‌లో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసపోయే వినియోగదారులకు రక్షణగా నిలుస్తోంది వినియోగదారుల పరిరక్షణ చట్టం. అయితే ఎలాంటి సందర్భాల్లో ఫిర్యాదు చేయాలి? ఎవరికి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి? అనే విషయాల గురించి పూర్తి వివరాలు మీకోసం.

Consumer Protection Act In Telugu
Consumer Protection Act In Telugu

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 3:22 PM IST

Consumer Protection Act In Telugu : మార్కెట్​లో ఏదైనా వస్తువు కొని ఇంటికి తీసుకెళ్లాక అది నకిలీదో లేదా వస్తువులో ఏమైనా లోపం ఉందని అని తెలిస్తే ఏం చేయాలి? చెల్లించిన బిల్లుకు సరైన సేవలు పొందకపోతే ఎవరిని అడగాలి? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. సాధారణంగా ఇలాంటి మోసాలు జరిగినప్పుడు కొంతమంది వారిని వారు నిందించుకుని అలాగే ఉండిపోతారు. కొందరు ఎదిరించాలనుకున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే ఇలాంటి సమయాల్లో వినియోగదారులు న్యాయ పోరాటం ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చు. తమకు జరిగిన నష్టానికి పరిహారం పొందొచ్చు. అయితే ఇలా చేయాలంటే వారికి 'వినియోదారుల పరిరక్షణ చట్టం'పై అవగాహన ఉండాలి. ఆ చట్టం గురించి పుర్తి వివరాలు తెలుసుకుందాం.

వినియోగదారుల పరిరక్షణ చట్టం
దేశంలో వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాలను నివారించేందుకు 'వినియోగదారుల పరిరక్షణ చట్టం- 1986' రూపొందింది. ఈ చట్టానికి 1991, 1993 సంవత్సరాల్లో కొన్ని సవరణలు జరిగాయి. ఇక ఈ చట్టాన్ని పూర్తిగా మార్చుతూ 2019లో తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం 2020 జులై 20 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా మరికొన్ని మార్పులు చేశారు.

ప్రశ్నించకపోతే మోసపోతారు!
నిత్యావసర సరకుల్లో కల్తీలు, అడ్డగోలు ధరలు, ఆర్థిక మోసాలు ఇలా వినియోగదారులను నిత్యం ఏదో ఒక రూపంలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో వారు వస్తు సేవలకు దూరం అవుతున్నారు. ఒకవైపు ఆధునికత పెరుగుతుండగా మరోవైపు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోసాలు, మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వంటివి అక్షరాస్యులను సైతం బోల్తా కొట్టిస్తున్నాయి. ఇంకా బోగస్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ఫండ్‌లతో అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఇలాంటి వారికి రక్షణగా నిలుస్తోంది వినియోగదారుల పరిరక్షణ చట్టం. ఫిర్యాదు చేస్తే చాలు, వారికి జరిగిన నష్టం లెక్కలేసి కారకుల నుంచి కక్కిస్తారు.

ఈ నష్టాలు వాటిల్లినప్పుడు!
వినియోగదారుడు పొందిన సేవల్లో, కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, వాటి వల్ల నష్టం వాటిల్లినా పరిహారం కోరడానికి ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం వీలు కల్పిస్తుంది.

  • ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, సేవాలోపం
  • ప్రభుత్వ వైద్యశాలల్లో వినియోగ రుసుము వసూలుపై
  • తప్పుడు టెలిఫోన్‌, విద్యుత్‌ బిల్లులపై
  • క్లెయిమ్‌ల పరిష్కారంలో బీమా కంపెనీలు ఏవైనా ఇబ్బందులు
  • రుసుము వసూలు చేసిన బ్యాంకు సేవల్లో లోపం
  • సొమ్ము చెల్లించి పొందిన ఏ వస్తు సేవల్లో లోపం ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు ఇలా చేయాలి?
వినియోగదారుడు పొందిన వస్తు, సేవల ధర, పరిమాణం, నాణ్యత తదితరాల్లో లోపం ఉన్నట్లు గుర్తిస్తే ముందుగా వస్తువు అమ్మిన వ్యక్తికి విషయం తెలియజేయాలి. అయినా అతడి ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి.

  • వినియోగదారుడు తన ఫిర్యాదును తెల్లకాగితంపై రాసి స్వయంగా జిల్లా వినియోగదారుల ఫోరానికి వెళ్లి ఇవ్వవచ్చు. పోస్టు, ఇంటర్నెట్​, ఈ-మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • వినియోగదారులు ఫోరానికి సమర్పించే ఫిర్యాదులో తాము కొనుగోలు చేసిన వస్తు, సేవల వివరాలతో పాటు, లోపాన్ని వివరించాలి.
  • వస్తువు కొనుగోలు చేసిన దుకాణం నుంచి కచ్చితంగా రసీదు తీసుకోవాలి.
  • వస్తువు కొనుగోలు చేసిన రెండేళ్లలోపు ఫిర్యాదు చేయవచ్చు.
  • వినియోగదారులు కోరే నష్ట పరిహారం విలువ రూ.5 లక్షల లోపు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఆ పైన నష్టపరిహారం కోరితే నామమాత్రపు సొమ్ము చెల్లిస్తే చాలు.

ఫిర్యాదు ఎక్కడ చేయాలి?
జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వినియోగదారుల ఫోరం, కమిషన్లు ఉన్నాయి. ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది కోరే నష్ట పరిహారాన్ని బట్టి ఉంటుంది. రూ.కోటి వరకు నష్ట పరిహారం కోరితే జిల్లా ఫోరం, రూ.కోటి- రూ.10 కోట్ల వరకు కోరితే రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించాలి. రూ.10 కోట్ల పైన నష్ట పరిహారం కోరితే జాతీయ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో ధ్రువీకరణ పత్రం ఇవ్వడం సహా 90 రోజుల్లో వివాదాన్ని పరిష్కరించాలని కొత్త చట్టం చెబుతోంది.

విద్య.. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా?

ABOUT THE AUTHOR

...view details