బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదార్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి సుంకం పెంపుతో ఒక్కసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,000కు చేరింది. తదుపరి మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో, దేశీయంగానూ మేలిమి బంగారం ధర రెండు రోజుల్లోనే 10 గ్రాములకు రూ.2,000 తగ్గినా, మళ్లీ శుక్రవారం కాస్త పెరిగి రూ.52,400కు చేరింది. వెండి ధర అయితే కిలో రూ.58,400గా ఉంది. ఈ ధరల్లో బంగారం కొనుగోలు చేసుకోవచ్చా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పండగల సీజన్ వరకు కూడా పసిడి, వెండి ధరలు ఈ స్థాయుల్లోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ విపణిలో పసిడి ధర తక్కువగానే ఉన్నా, దిగుమతి సుంకాలకు తోడు డాలర్ మారకపు విలువ భారం వల్ల దేశీయంగా పసిడి ధర అంతగా దిగి రాలేదు.
అంతర్జాతీయంగానూ పెరిగి.. తగ్గి..
అదే అంతర్జాతీయ విపణులను తీసుకుంటే, అనిశ్చితి పరిస్థితుల్లో ఆదుకునే పెట్టుబడి సాధనంగానే పసిడిని పరిగణిస్తారు. ఈ ఏడాది ఆరంభంలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర అంతర్జాతీయ విపణుల్లో 1790 డాలర్ల వరకు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుంచి ధర పెరగడం ప్రారంభించి, యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న మార్చిలో గరిష్ఠంగా 2052.60 డాలర్లకు చేరింది. తదుపరి అమెరికా ఫెడ్ సహా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, వ్యవస్థల్లో నగదు లభ్యత తగ్గడం, అమెరికా బాండ్ రాబడుల ప్రతిఫలాలకు అనుగుణంగా డాలర్‌కు గిరాకీ పెరగడంతో బంగారం వైపునకు పెట్టుబడులు తరలిరావడం తగ్గింది. ఫలితంగా మళ్లీ ధర తగ్గుతూ వస్తోంది. ఇక మాంద్యం భయాలు చుట్టుముడుతున్నందున, ఇతర కమొడిటీలతో పాటు బంగారానికి గిరాకీ మరింత క్షీణించడంతో, ఈనెల 6న 9 నెలల కనిష్ఠమైన 1723 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. శనివారం రాత్రి 1740 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
దేశీయంగా చూస్తే 2021-21లో 34.62 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.73 లక్షల కోట్ల), 2021-22లో 46.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.64 లక్షల కోట్ల) విలువైన బంగారం అధికారికంగా దేశంలోకి దిగుమతి అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, వచ్చే పండగల సీజన్ విక్రయాల కోసం బంగారాన్ని ఏప్రిల్-జూన్‌లో మన వ్యాపారులు అధికంగా దిగుమతి చేసుకున్నారు.