తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్‌ స్కోర్‌పై ఇవన్నీ అపోహలే.. మరి వాస్తవాలేంటో తెలుసా?

రుణం పొందడంలో క్రెడిట్​ స్కోర్​ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, దీనికి సంబంధించి చాలా మందికి అన్ని విషయాలు తెలియవు. ఈ క్రమంలో క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారాలు ఏంటి?.. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.

CREDIT SCORE
క్రెడిట్‌ స్కోర్‌

By

Published : Dec 13, 2022, 4:51 PM IST

Credit Score : క్రెడిట్‌ స్కోర్‌ ప్రాధాన్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రుణ మంజూరులో ఇది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే. వడ్డీరేటు నిర్ధారణకు బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటున్న అంశాల్లో ఇదొకటి. రుణ రేటు ఏమాత్రం తగ్గినా అది మన ఈఎంఐని.. తద్వారా మన నెలవారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇలా క్రెడిట్‌ స్కోర్‌ మన ఆర్థిక జీవితంలో ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. అయితే, దీనికి సంబంధించి చాలా మందికి అన్ని విషయాలు తెలియవు. ఈ క్రమంలో క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటి.. మరి నిజాలేంటో చూద్దాం..

క్రెడిట్ నివేదికను తరచూ తనిఖీ చేస్తే స్కోర్‌పై ప్రభావం పడుతుంది
అది నిజం కాదు. మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుందనే ఆందోళన లేకుండా మీరు మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఒక నిర్ధిష్ట వ్యవధిలో ఒకేసారి మీ క్రెడిట్‌ వివరాల గురించి అడిగితే, అది మీ స్కోర్‌ను కొన్ని పాయింట్లు తగ్గించవచ్చు. అంతే తప్ప తరచూ తనిఖీ చేసుకోవడం మంచిదే అని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఫలితంగా ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది.

క్రెడిట్‌ స్కోర్‌

మెరుగైన క్రెడిట్ స్కోర్‌కు దోహదపడే అంశాల్లో ఆదాయం ఒకటి
మీ క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగానే మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తారు. క్రెడిట్‌ నివేదికలో అసలు ఆదాయానికి సంబంధించిన వివరాలు ఉండవు. మీరు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నా.. మీ ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు నిర్వహణ సరైన పద్ధతిలో లేకపోతే మీ క్రెడిట్ స్కోర్‌ తగ్గిపోతుంది.

పేలవమైన క్రెడిట్‌ స్కోర్ ఉంటే లోన్‌ రాదు
మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. క్రెడిట్‌ స్కోర్‌ ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోరు. మీ ఆర్థిక చరిత్రను తెలియజేసే అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆదాయం, సహ దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంకులకు మీపై ఉన్న నమ్మకం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకవేళ బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థ క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందని మీ రుణ దరఖాస్తును తిరస్కరిస్తే ఇతర బ్యాంకులను సంప్రదించొచ్చు. అయితే, రుణరేటు మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంది.

క్రెడిట్‌ స్కోర్‌

డెబిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ స్కోర్‌ మెరుగవుతుంది
డెబిట్ కార్డ్ అనేది సేవింగ్స్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ఒక సాధనం మాత్రమే. క్రెడిట్‌ స్కోర్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. బలమైన క్రెడిట్‌ స్కోర్‌ను నిర్మించుకోవాలంటే.. క్రెడిట్‌ కార్డును నిర్వహిస్తూ ఉండాలి. లేదా రుణం తీసుకొని దాన్ని సకాలంలో చెల్లించాలి. అయితే, క్రెడిట్‌ కార్డు పొందగానే లేక రుణం మంజూరు కాగానే స్కోర్‌ మెరుగవ్వదు. కొంత సమయం పడుతుంది.

పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు
ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు లేదా బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల క్రెడిట్ స్కోర్‌ దెబ్బతింటుందని చాలా మంది భావిస్తారు. నిరుపయోగంగా ఉన్న వాటిని మూసివేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్‌ చరిత్ర గడువు తగ్గిపోతుంది. సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర ఉంటే రుణదాతలకు మీపై సదాభిప్రాయం ఏర్పడుతుంది.

ఎవరైనా మీ క్రెడిట్‌ స్కోర్‌ని తనిఖీ చేయవచ్చు
మీ క్రెడిట్ స్కోర్‌ని తనిఖీ చేయడానికి అందరికీ అవకాశం ఉండదు. మీ అనుమతి తీసుకున్న తర్వాతే మీ క్రెడిట్‌ స్కోర్‌ను చూసే హక్కు ఉంటుంది. అదీ మీరు మీ వివరాలను ఇస్తేనే సాధ్యమవుతుంది.

కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌ తగ్గుతుంది
ఇది వాస్తవం కాదు. అయితే, అందుబాటులో ఉన్న అన్ని చోట్లా రుణం కోసమో లేక క్రెడిట్‌ కార్డు కోసమో దరఖాస్తు చేసుకుంటూ పోతే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ వ్యవధిలో చాలా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీ క్రెడిట్‌ స్కోర్‌ను యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంది. అది ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది.

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే తక్కువ వడ్డీరేటుతో రుణం లభిస్తుంది
రుణ మంజూరుకు బ్యాంకులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. మీ ఆదాయం, వయసు, క్రెడిట్‌ చరిత్ర అన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ బలంగా ఉన్నప్పటికీ.. మీ క్రెడిట్‌ ప్రవర్తనతో బ్యాంకులు సంతృప్తి చెందనట్లయితే.. అధిక వడ్డీరేటుకు రుణం ఇచ్చే అవకాశం ఉంది. లేదా దరఖాస్తును తిరస్కరించనూ వచ్చు.

రుణాన్ని తీర్చేస్తే క్రెడిట్ నివేదిక నుంచి దాని వివరాలు పోతాయి
రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడం వల్ల దానికి సంబంధించిన వివరాలు మీ క్రెడిట్‌ నివేదిక నుంచి తొలగిపోతాయి అనుకోవడం అపోహే. ఆ లావాదేవీకి సంబంధించిన వివరాలు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి. పైగా అవి మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. మీ క్రెడిట్‌ చరిత్రలో ఏవైనా పొరపాట్లు జరిగితే అవి 7 సంవత్సరాల వరకు.. దివాలాకు సంబంధించిన సమాచారం పదేళ్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి రుణం, క్రెడిట్‌ కార్డు లేకపోతేనే మేలు
ఇదీ నిజం కాదు. మీ క్రెడిట్ కార్డ్ లేదా లోన్ దరఖాస్తుల విషయానికి వస్తే రుణదాతలు మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగానే మీ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అందువల్ల ఎలాంటి క్రెడిట్‌ చరిత్ర ఉండకపోవడం ఉత్తమ విషయమేమీ కాదు.

ABOUT THE AUTHOR

...view details