Common Mistakes To Avoid While Taking Bank Loan : చాలా మంది వ్యక్తిగత రుణాల కోసం లేదా గృహ, వాహన, విద్యా రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే ఇలా బ్యాంకు రుణాలు తీసుకున్న దగ్గర నుంచి వాటిని తీర్చేవరకు.. తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల భారీగా నష్టపోతుంటారు. మరి ఆ తప్పులు ఏమిటో.. అవి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిగత రుణాలు
Mistakes To Avoid While Taking Personal Loan :
- బ్యాంకులు ఎలాంటి హామీ లేకుండా వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుంటాయి. అయితే ఇది పూర్తిగా అసురక్షిత రుణం. కనుక అధిక వడ్డీ రేటును విధిస్తూ ఉంటాయి. అయితే మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి మాత్రం.. కాస్త తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తుంటాయి. కానీ చాలా మంది తగిన అవగాహన లేకపోవడం వల్ల.. తక్కువ క్రెడిట్ స్కోర్‌తో వ్యక్తిగత రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది.
- మరికొందరు తక్కువ వ్యవధిలో చాలా సార్లు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇది కూడా తప్పే. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది. కనుక, మీరు చేసుకున్న దరఖాస్తును ఏ కారణం చేతనైనా తిరస్కరిస్తే.. మళ్లీ 6 నెలల వరకు అప్లై చేసుకోకపోవడమే మంచిది. అంతేకాకుండా ఈ 6 నెలల వ్యవధిలో మీ బకాయిలు అన్నీ తీర్చేయాలి. ఫలితంగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఫలితంగా తక్కువ వడ్డీకే రుణం మంజూరు అయ్యే అవకాశం ఏర్పడుతుంది.
- చాలా మంది వ్యక్తిగత రుణాలు తీసుకుని.. ఇంటిని పునరుద్ధరించడం లాంటి పనులు చేస్తుంటారు. ఇది ఏ మాత్రం సరైన విధానం కాదు. ఎందుకంటే.. వ్యక్తిగత రుణాల కంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
- మరికొందరు తక్కువ మొత్తం పర్సనల్ లోన్ తీసుకొని, ఎక్కువ కాలవ్యవధిని సెట్ చేసుకుంటారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే.. దీర్ఘకాల రుణాలపై ఈఎంఐ భారం తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కానీ చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
- పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు ప్రీ-క్లోజర్ ఛార్జీలు గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే ముందస్తుగా రుణం చెల్లించేటప్పుడు.. అనవసరంగా ప్రీ-క్లోజర్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కనుక వ్యక్తిగత రుణాల విషయంలో ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి.
క్రెడిట్ కార్డు రుణం
Mistakes To Avoid While Taking Credit Card Loan :చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి.. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే సాధారణ కొనుగోళ్లపై లభించే గ్రేస్ పీరియడ్ దీనికి వర్తించదు. పైగా ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా తీసుకున్న రుణంలో 2-3 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ లెక్కిస్తూ ఉంటారు. కనుక భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుములు సహా, వడ్డీపై వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అన్నింటి కంటే మించి మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్‌లో బ్యాంకు రుణాలు లభించే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. కనుక, వీలైనంత వరకు క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోకపోవడమే మంచిది.
వాహన రుణాలు
Mistakes To Avoid While Taking Vehicle Loan :
- నేటి కాలంలో మధ్యతరగతి ఆదాయ వర్గాలవారు కూడా వాహనాలను కొంటున్నారు. కానీ, వాహన రుణాలు తీర్చే కాలవ్యవధిని ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు వాహన రుణాలను తీర్చడానికి 3-7 సంవత్సరాల కాలవ్యవధిని ఇస్తుంటాయి. మీకు కనుక మంచి ఆదాయం ఉంటే.. తక్కువ కాలవ్యవధిని ఎంచుకోండి. ఎందుకంటే.. అప్పు తీర్చేందుకు దీర్ఘకాల వ్యవధిని ఎంచుకుంటే, చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కనుక, కేవలం మీ నెలసరి ఆదాయం బాగా తక్కువ ఉన్నప్పుడే.. వాహన రుణాలు తీర్చేందుకు దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకోండి.
- కొందరు కారు డీలర్లు కూడా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని.. వాహన రుణాలకు మధ్యవర్తులుగా ఉంటారు. దీని వల్ల సదరు డీలర్లకు కమిషన్/ అదనపు రుసుములు వస్తాయి. కానీ దీని వల్ల వాహన కొనుగోలుదార్లకు నష్టం ఏర్పడుతుంది. అందువల్ల వాహన రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే.. మార్కెట్లో వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్స్ గురించి, వాటిపై విధించే వడ్డీ రేట్ల గురించి రీసెర్చ్ చేయండి. తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇచ్చే బ్యాంకు నుంచి రుణం తీసుకోండి.
- వాహన రుణం తీసుకునేటప్పుడు కనీసం 30- 40 శాతం వరకు డౌన్‌పేమెంట్ చెల్లించడం మంచిది. దీని వల్ల ఈఎంఐ కాలవ్యవధి, వడ్డీ భారం రెండూ తగ్గుతాయి.
గృహ రుణం
Mistakes To Avoid While Taking Home Loan :
- హోమ్ లోన్ అనేది ఒక దీర్ఘకాలిక రుణం అని గుర్తించుకోవాలి. కనుక కాలవ్యవధి, వడ్డీ భారం రెండూ ఎక్కువగానే ఉంటాయి. చాలా మంది గృహ రుణం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు.
- ఉదాహరణకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు.. మనం చెల్లించాల్సిన ఈఎంఐ కూడా పెరుగుతుంది. కానీ చాలా మంది ఇలా పెరిగిన ఈఎంఐను చెల్లించడానికి ఇష్టపడరు. అందుకు బదులుగా కాలవ్యవధి పెంచుకోవడానికి మొగ్గుచూపుతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఈఎంఐల సంఖ్య పెరిగినప్పుడు.. చక్రవడ్డీ ప్రభావం వల్ల మీరు చెల్లించాల్సిన వడ్డీ కూడా బాగా పెరిగిపోతుంది. అందువల్ల రుణగ్రహీతలు పెరిగిన వడ్డీని ఈఎంఐ షెడ్యూల్ ప్రకారం.. ఎప్పటికప్పుడు చెల్లించడమే మంచిది.
- కొంత మంది వడ్డీ ఎక్కువ ఉన్నా కూడా.. అదే బ్యాంకులో రుణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇతర బ్యాంకుల్లో కనీసం 1 శాతం వడ్డీ అయినా తగ్గిస్తుంటే.. మీ గృహ రుణాన్ని దానికి బదిలీ చేసుకోవాలి. దీని వల్ల మీపై ఉన్న వడ్డీ భారం భారీగా తగ్గుతుంది.
- మరికొంత మంది వడ్డీ పెరుగుతుందనే భయంతో ఫిక్స్‌డ్ హోమ్‌లోన్‌ను తీసుకుంటారు. ఇది కూడా సరైంది కాదు. ఒక్కోసారి వడ్డీ రేట్లు బాగా తగ్గవచ్చు. అలాంటి సందర్భాల్లో ఫ్లోటింగ్ రుణాల వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు.. ఇంటి రుణంపై పన్ను మినహాయింపులు ఉంటాయి. కనుక, వీలైతే ముందస్తు చెల్లింపులు కూడా చేయవచ్చు. దీని వల్ల పన్ను మినహాయింపులు లభిస్తాయి. పైగా వడ్డీ భారం కూడా బాగా తగ్గుతుంది.