Co Branded Credit Cards : నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకూ బాగా పెరిగిపోతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని చాలా సులువుగా మంజూరు చేస్తున్నాయి. పైగా క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు లాంటి బహుళ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఫలితంగానే నేడు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు.. ఇతర సంస్థలు/ బ్యాంకులతో కలిసి .. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
What Is Co Branded Credit Card : కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డులు.. సాధారణ క్రెడిట్ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవానికి మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి అనేక రకాల క్రెడిట్ కార్డులు వస్తున్నాయి. వ్యాపారులు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, నిర్దిష్ట బ్రాండెడ్ కంపెనీలు.. బ్యాంకులతో కలిసి (టై-అప్‌తో) కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొని వస్తాయి. వీటి ద్వారా తమ యూజర్లకు బెస్ట్ ఆఫర్స్, బెనిఫిట్స్, డిస్కౌంట్స్ అందిస్తాయి. వాస్తవానికి ఆయా కంపెనీలు.. తమ అనుబంధ బ్రాండ్లతో, బ్యాంకులతో కలిసి వీటిని అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీతో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజుపై రాయితీలు కల్పిస్తాయి. అందువల్ల మీ అలవాట్లకు సరిపోయే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకోవడం ఉత్తమం. అప్పుడే మీరు సాధారణ క్రెడిట్ కార్డు కంటే అదనపు రివార్డు పాయింట్లు, డిస్కౌంట్ ప్రయోజనాలు పొందుతారు.