తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డ్​ స్థాయికి సీఎన్​జీ ధర.. కేంద్రం ఏమందంటే? - నేచురల్​ గ్యాస్​

CNG price in India: దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు సీఎన్​జీ గ్యాస్​ ధరలు భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డిమాండ్​కు తగినట్లుగా కొత్త కేటాయింపులు లేకపోవటం వల్లే భారం పడుతోందని సిటీ గ్యాస్​ పంపిణీ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పెరిగిన డిమాండ్​కు సంబంధించిన కొత్త డేటా అందించలేదని, అప్డేటెడ్​ సమాచారం కోసం వేచి ఉన్నామని కేంద్రం పేర్కొనటం గమనార్హం.

CNG price in India
రికార్డ్​ స్థాయికి సీఎన్​జీ ధర.

By

Published : Apr 17, 2022, 5:22 PM IST

CNG price in India: దేశీయ క్షేత్రాల నుంచి సిటీ గ్యాస్​ పంపిణీ విభాగాలకు డిమాండ్​కు తగినట్లుగా కొత్త కేటాయింపులు చేయకపోవటం వల్ల కంప్రెస్డ్​ నేచురల్​ గ్యాస్​ (సీఎన్​జీ), పైప్డ్​ కుకింగ్​ గ్యాస్​(పీఎన్​జీ) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు సీఎన్​జీ ధరలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. సిటీ గ్యాస్​ పంపిణీ(సీజీడీ) విభాగాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా 100 శాతం గ్యాస్​ సరఫరా చేయాలన్న కేంద్ర కేబినేట్​ నిర్ణయానికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం 2021, మార్చి నాటి డిమాండ్​కు తగినట్లుగా గ్యాస్​ సరఫరా జరుగుతోంది. దీంతో ఇప్పటి డిమాండ్​ను చేరుకునేందుకు సిటీ గ్యాస్​ ఆపరేటర్లు అధిక ధరకు దిగుమతి చేసుకున్న ఎల్​ఎన్​జీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది గ్యాస్​ ధరలు రికార్డు స్థాయికి చేరుకునేలా చేస్తోందని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఏటా ఆరు నెలలకోసారి డిమాండ్​కు తగినట్లుగా నేచురల్​ గ్యాస్​ కేటాయింపులు సవరిస్తుంది కేంద్రం. గత ఆరు నెలల్లో ఉన్న డిమాండ్​ను బట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్, అక్టోబర్​లో ఈ కేటాయింపులు ఉంటాయి. అయితే.. 2021, మార్చి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కొత్త కేటాయింపులు చేయకపోవటం గమనార్హం. అయితే.. పంపిణీ కేంద్రాలకు గ్యాస్​ సరఫరా నిలిపివేయలేదని, అదనంగా కేటాయింపులు చేస్తే విద్యుత్తు, ఎరువులు వంటి కీలక పరిశ్రమలకు సరఫరాలో కోత పడుతుందని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిమాండ్​కు సంబంధించి కొత్త డేటా కోసం చూస్తున్నట్లు పేర్కొంది.

" 2022, ఏప్రిల్​లో గ్యాస్​ కేటాయింపుల కోసం సీజీడీల నుంచి 2021, అక్టోబర్​ నుంచి 2022, మార్చి వ్యవధిలో డిమాండ్​, సరఫరాకు సంబంధించిన అప్డేటెడ్​ డేటా కోసం వేచి ఉన్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. 2020 అక్టోబర్​ నుంచి 2021, మార్చి వరకు ఉన్న డేటా ప్రకారం 2021 ఏప్రిల్​- అక్టోబర్ కేటాయింపులు జరిగాయి."

- ఇంధన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం.

మూడు నెలలకోసారి సవరించాలి:సీఎన్​జీ, పీఎన్​జీ డిమాండ్​ను అందుకునేందుకు ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్​ కేటాయింపులు సవరించాలని, గడిచిన రెండు నెలల డిమాండ్​ను పరిగణనలోకి తీసుకోవాలని సీజీడీ ఆపరేటర్లు కేంద్రాన్ని కోరుతున్నారు. వారి వినతులను పట్టించుకోని కేంద్రం ఏడాదిగా ఎలాంటి కొత్త కేటాయింపులు చేయలేదని పంపిణీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. అలా చేస్తే కీలక పరిశ్రమలకు కోత విధించాల్సి వస్తుందని ఇంధన శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

110 శాతం పెరిగిన ధరలు: డిమాండ్​కు తగినంతగా కేటాయింపులు లేకపోవటం వల్ల సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరలు 110 శాతం పెరిగాయి. ధరల మార్పు విధానం(ఏపీఎం) ప్రకారం సీఎన్​జీ, పీఎన్​జీ ధరలు మిలియన్​ బ్రిటీష్​ థర్మల్​ యూనిట్​కు 2.90 అమెరికా డాలర్ల నుంచి 6.10 డాలర్లకు చేరుకున్నాయి. సరిపడా కేటాయింపులు లేకపోవటం వల్ల దేశీయ ధరలకు ఆరు రెట్లు అధికంగా ఉన్న ఇంపోర్టెడ్​ లిక్విఫైడ్​ నేచురల్​ గ్యాస్​ (ఎల్​ఎన్​జీ)ను కొనుగోలు చేయాల్సి వస్తొంది. దీని వల్ల ఏడాదిలో సీఎన్​జీ, పీఎన్​జీ కిలో ధర 60 శాతం లేదా రూ.28 పెరిగింది. ఇది గ్యాస్​ పంపిణీ సంస్థల నిర్వహణకు ప్రశ్నార్థకంగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కొత్త నగరాలకు గ్యాస్​ సరఫరా చేసేందుకు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులన్న లక్ష్యాన్ని వెనక్కి నెడుతోందన్నారు. పర్యావరణ హిత నేచురల్​ గ్యాస్​ వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కేటాయింపులు ముఖ్యమన్నారు.

ఏప్రిల్​ 14న సీఎన్​జీ, పీఎన్​జీ గ్యాస్​ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దిల్లీలో కిలో సీఎన్​జీపై రూ.2.50, పీఎన్​జీపై రూ.4.25 పెంచింది. దీంతో ప్రస్తుతం దేశంలో సీఎన్​జీ గ్యాస్​ ధర కిలోకు దిల్లీలో రూ.71.61, ముంబయిలో రూ.72గా ఉంది. డిమాండ్​ను చేరుకునేందుకు ఎల్​ఎన్​జీని కొనుగోలు చేస్తే వాటి ధరలు రూ.100-105కు చేరుకుంటాయి.

ఇదీ చూడండి:దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?

ABOUT THE AUTHOR

...view details