కార్యకలాపాలు సాగించని, ఉనికి కోల్పోయిన, మూతబడిన కంపెనీలను రికార్డుల నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఇటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 వేల కంపెనీలు ఉన్నట్లు సమాచారం. కార్యకలాపాలు సాగించని, రికార్డులు నిర్వహించని, వార్షిక రిటర్న్‌లు దాఖలు చేయని పలు కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి.
15 లక్షలకు పైగా నమోదు
దేశవ్యాప్తంగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని వివిధ ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) కార్యాలయాల్లో 15 లక్షలకు పైగా కంపెనీలు నమోదై ఉన్నాయి. గత ఏడాది కాలంలోనే 2.5 లక్షల కంపెనీలు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నాయి.
- కొత్తగా ఏర్పాటైన కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో ప్రారంభించి, ఆ సమాచారాన్ని ఆర్వోసీలకు తెలియజేయాలి. సమయానుకూలంగా రికార్డులు సమర్పించాలి. ఇవే నిబంధనలు అన్ని కంపెనీలకూ వర్తిస్తాయి.
- లాభనష్టాల ఖాతా, ఆస్తిఅప్పుల పట్టీ, వార్షిక నివేదిక, ఇతర సమాచారంతో కూడిన రికార్డులు సకాలంలో దాఖలు చేయకపోతే, దానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. నోటీసులు ఇచ్చినా స్పందించని కంపెనీలను రద్దు చేస్తారు. ఆర్వోసీ రికార్డుల నుంచి అటువంటి కంపెనీల పేర్లు తొలగిస్తారు. ఈ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేపడుతుంది.
- కేవలం కాగితాలకే పరిమితమైన బోగస్ కంపెనీలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకోవడం క్రమం తప్పకుండా చోటుచేసుకునే ప్రక్రియే. ఇటువంటి ఎన్నో కంపెనీలను ఆర్వోసీ రికార్డుల నుంచి తొలగించడానికి రంగం సిద్ధమవుతోంది.