Oppo Oneplus ban: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఫోన్ల అమ్మకాలపై జర్మనీ నిషేధం విధించింది. ఇకపై జర్మనీలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్ అమ్మకాలు జరపకూడదని తెలిపింది. నోకియామాబ్.నెట్ కథనం ప్రకారం నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌పై జర్మనీలో నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొంది. స్థానిక న్యాయస్థానం తీర్పుతో ఒప్పో, జర్మనీ కంపెనీలు ఇక ఎప్పటికీ తమ ఉత్పత్తులను జర్మనీలో అమ్మలేవని తెలిపింది. సదరు పేటెంట్‌కు యూరప్ వ్యాప్తంగా నోకియా హక్కుదారు కావడం గమనార్హం. ఇంతకీ నోకియా దేనికి సబంధించిన పేటెంట్ కోసం ఒప్పో, వన్‌ప్లస్‌పై ఫిర్యాదు చేసింది? ఇంకా ఏయే దేశాల్లో ఈ కంపెనీలపై నోకియా వేసిన కేసులు విచారణలో ఉన్నాయనేది తెలుసుకుందాం.
నోకియా X ఒప్పో, వన్‌ప్లస్
నోకియా కంపెనీ 5జీ నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే సాంకేతికతకు సంబంధించి పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీనికోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలు నోకియాతో ఒప్పందం చేసుకోకుండా, నోకియా నుంచి లైసెన్స్ తీసుకోకుండా ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ నోకియా కంపెనీ 2021, జులైలో ఆసియా, యూరప్‌లోని పలు దేశాల్లో కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఒప్పో కంపెనీ, నోకియాతో 2018 నవంబర్‌లో చేసుకున్న ఒప్పందం 2021 జూన్‌తో ముగిసిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. ఒప్పో ఈ లైసెన్స్‌ను పునరుద్ధరించకపోగా, రెన్యువల్ ఆఫర్‌ను కూడా ఒప్పో తిరస్కరించినట్లు నోకియా ఆరోపిస్తోందని నోకియామాబ్ తెలిపింది.