తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.12 వేలలోపు చైనా ఫోన్లపై నిషేధం, స్పష్టతనిచ్చిన కేంద్రం - చైనా ఫోన్లు లేటెస్ట్ న్యూస్

చైనా కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఇందుకు సంబంధించి వార్తలు వచ్చిన నేపథ్యంలో వివరణ ఇచ్చింది. చైనా మొబైల్‌ తయారీ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొంది.

CHINA MOBILE BAN
CHINA MOBILE BAN

By

Published : Aug 30, 2022, 7:36 AM IST

CHINA MOBILE BAN : చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సోమవారం వెల్లడించారు. భారత్‌ నుంచి ఎగుమతులు కూడా పెంచాలని కూడా దేశంలో తయారీ/అసెంబ్లింగ్‌ యూనిట్లను నిర్వహిస్తున్న చైనా మొబైల్‌ సంస్థలకు సూచించారు.

దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో, రూ.12 వేలలోపు చైనా ఫోన్ల విక్రయాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి తాజాగా స్పష్టతనిచ్చారు. చైనా మొబైల్‌ తయారీ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో దేశీయ కంపెనీలు ప్రధాన పాత్ర పోషించాలని కోరుకుంటున్నామని, అయితే ఇదే సమయంలో విదేశీ బ్రాండ్‌లు లేకుండా చేయడం తమ ఉద్దేశం కాదని వివరించారు. రూ.12 వేల లోపు చైనా ఫోన్ల విక్రయాలను భారత్‌లో నిషేధించాలనే ప్రతిపాదన చేస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదన్నారు. 2025-26 నాటికి 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తితో పాటు 120 బి.డాలర్ల ఎగుమతుల లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుత ఉత్పత్తి సుమారు 76 బి.డాలర్లుగా ఉంది.

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక రిజిస్ట్రీ
మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ శర్మ తెలిపారు. ఈ సమాచారం ద్వారా మోసపూరిత లావాదేవీలు నిర్వహించే వారిని సులువుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. దీన్ని ఎప్పటిలోగా తీసుకొచ్చేదీ ఇప్పుడే చెప్పలేమని, దీనికి సంబంధించి భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

కోర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ (సీఐసీ) వినియోగదారులూ ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీం పరిధిలోకి వస్తారని తెలిపారు. 2021-22లో అంబుడ్స్‌మన్‌కు 4.18 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, 97.9శాతం కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఖాతాల వివరాలు, ఇతర రహస్య సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. ఫోన్లలో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల అధీకృత యాప్‌లనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు.

వొడాఫోన్‌ 5జీ సేవలు ఇప్పుడే కాదు
తన 5జీ సేవలను ఆవిష్కరించడానికి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని వొడాఫోన్‌ ఐడియా అంటోంది. అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది; వినియోగదారు గిరాకీ; పోటీ పరమైన అంశాలు.. ఇలా పలు అంశాలపై అది ఆధారడి ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ 5జీ సేవలను అందించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 27వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌) సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'కంపెనీ ప్రమోటర్లు రూ.4,940 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. నిధుల సమీకరణ కోసం పెట్టుబడిదార్లతో సంస్థ చర్చల్లో ఉంద'న్నారు. రూ.18,800 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను ఇటీవలి వేలంలో కంపెనీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌ సర్కిళ్లలో అదనంగా 4జీ స్పెక్ట్రమ్‌నూ సొంతం చేసుకుంది. కాగా, కంపెనీ సీఎఫ్‌ఓ అక్షయ మూంద్రాను సీఈఓగా; టక్కర్‌ను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించడానికి కంపెనీ ప్రతిపాదించింది.

ABOUT THE AUTHOR

...view details