Charges On Various Bank Loans :బ్యాంకులు మనుగడ సాగించాలంటే రుణాలు చాలా కీలకమైనవి. అందుకే బ్యాంకులు గృహ, వాహన, వ్యక్తిగత, ఎడ్యుకేషన్ వంటి అనేక రకాల లోన్లు అందించి, ఆ రుణాలపై వడ్డీతో పాటు అనేక రకాల ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే ఈ ఛార్జీలు మనం తీసుకునే లోన్‌ను బట్టి ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి రుణం అధిక మొత్తంతో కూడుకున్నది కాబట్టి, దీనికి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు వంటి అనేక ఇతర రుసుములు కూడా తీసుకుంటారు. హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసే ముందు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హోమ్ లోన్‌పై ఛార్జీలు
హోమ్ లోన్‌పై బ్యాంకులు సగటున 7-9 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి వడ్డీ తక్కువ పడుతుంది. చాలా మంది బ్యాంకు రుణంపై తక్కువ వడ్డీని చూసి దరఖాస్తు చేస్తుంటారు. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తర్వాత కూడా చాలా ఛార్జీలు వసూలు చేస్తాయి. హోమ్ లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు, దరఖాస్తుదారుడు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి. దానికి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ఈ ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
సాధారణంగా బ్యాంకులు లోన్ మొత్తం అమౌంట్‌పై 0.5-1 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. అయితే మన వద్ద ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేశారు గనుక, మన రుణ దరఖాస్తు కచ్చితంగా ఆమోదిస్తారని భావించకూడదు. ఒకవేళ బ్యాంకు హోమ్ లోన్ దరఖాస్తును తిరస్కరిస్తే, రుణగ్రహీతకు ఈ రుసుంలో ఎలాంటి మొత్తం వాపసు రాదు. ఇంటి రుణాన్ని ఆమోదించిన తర్వాత బ్యాంకులు నిర్వహణ ఫీజును వసూలు చేస్తాయి. లోన్ తీరే వరకు ఆస్తి (ఇంటి) దస్తావేజులను బ్యాంకు భద్రపరుస్తుంది. దీనికి కూడా రుసుం వసూలు చేస్తుంది. ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐ కాలవ్యవధిని మార్చాలనుకుంటే, దానిపై బ్యాంకుకు అదనపు ఛార్జీని వడ్డిస్తుంది.
హోమ్ లోన్‌ను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఫిక్స్‌డ్ రేటుపై ఇంటి రుణాన్ని తీసుకున్నవారు లోన్‌ను ముందస్తుగా చెల్లించడాని(ప్రీ-క్లోజర్)కి సిద్ధపడితే బ్యాంకు పెనాల్టీని వసూలు చేస్తుంది. ఇది మిగిలిన మొత్తంలో 2 నుంచి 6 శాతం వరకు ఉండొచ్చు. ఒకవేళ మీరు రూ.6 లక్షల బ్యాలెన్స్ చెల్లించి లోన్ ఖాతాను క్లోజ్ చేస్తే రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు బ్యాంకుకు చెల్లించాల్సి రావచ్చు.
ఆస్తికి సంబంధించిన టైటిల్ డీడ్‌లు/ ఓనర్‌షిప్ పత్రాలను లోన్ కోసం తాకట్టుగా బ్యాంకుకు అందిస్తారు. మీ ఆస్తి చట్టపరమైన సమస్యలో చిక్కుకున్నట్లయితే ఈ పత్రం ఉపయోగపడుతుంది. దీనిపైనా రుసుం ఉంటుంది. ఇలాంటి ఛార్జీలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలు ఆస్తి ధరలో 0.1 శాతం నుంచి 0.2 శాతం వరకు ఉంటాయి. హోమ్ లోన్‌తో పాటు ఇంటి/ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలని కొన్ని బ్యాంకులు పట్టుబడుతుంటాయి. ఇలా చేయడం తప్పనిసరి కాదని గుర్తు పెట్టుకోండి. హోమ్ లోన్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు బ్యాంకులు రుణగ్రహీతకు అనేక సేవలను అందిస్తాయి. ఇవి జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, టెక్నికల్, లీగల్ అసెస్‌మెంట్ ఫీజు మొదలైన వాటన్నింటిపై జీఎస్‌టీని వసూలు చేస్తాయి.
ఎడ్యుకేషన్ లోన్‌పై ఛార్జీలు
ప్రస్తుతం భారతదేశంలో విద్య కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. బ్యాంకులు కూడా ఈ రుణాలను విరివిగానే మంజూరు చేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఈ ఫీజు మనం తీసుకునే రుణం మొత్తంలో ఒక శాతం మేర ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు మనం చెల్లించే ప్రాసెసింగ్ ఫీజుపై సర్వీస్ ఛార్జీని కూడా విధిస్తాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైనప్పుడు, ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తాయి. ఇది ఈఎంఐ మొత్తంలో 2-3 శాతం ఉండొచ్చు. దీనికి అదనంగా జీఎస్‌టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్‌ను తీసుకున్నప్పుడు బీమా కూడా ప్రధానమైనది. రుణ చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు, లోన్ తీసున్నవారు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ బీమా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇలా తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్ తీసుకొకపోతే, కొన్ని బ్యాంకులు అదనపు వడ్డీని విధిస్తాయి. ఇది ప్రభుత్వ బ్యాంకుల్లో 0.05 శాతం నుంచి 0.25 శాతం వరకు ఉంటుంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో 2 శాతం వరకు ఉంటుంది.