finance department monthly report: గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కోసం డిమాండ్ తగ్గడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ పథకం కింద 2020-21లో 44.7 కోట్ల పనిదినాలు నమోదుకాగా, 2021-22లో అది 10.3% తగ్గి 40.1 కోట్ల పనిదినాలకు పరిమితమైంది. దీన్ని బట్టి ఉపాధి హామీ పథకం మీద ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి, జీవనోపాధి మెరుగపడ్డాయని స్పష్టమవుతోందని తెలిపింది. 2022 మార్చిలో ఉపాధి హామీ పథకం కింద పని కోసం 2.9 కోట్ల మందే డిమాండ్ చేశారని, 2021 మార్చితో పోలిస్తే ఇది 19% తక్కువని విశ్లేషించింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఉపాధి హామీ పథకం కింద పనికోసం డిమాండ్‌చేసే వారి సంఖ్య కొవిడ్ ముందుకాలం నాటి స్థాయికి చేరినట్లు పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంవల్ల ఉద్యోగావకాశాలు పెరిగిన విషయం ఈపీఎఫ్ చందాదారుల సంఖ్య ద్వారా వెల్లడైనట్లు తెలిపింది.
ఈపీఎఫ్ చందాదార్లు:2021-22లో (ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు) ఈపీఎఫ్ చందాదారుల సంఖ్య 1.1 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 2020-21తో పోలిస్తే ఇది 44.3% అధికం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా 2021-22లో మొత్తం రూ.6.15 లక్షల కోట్లు బదిలీచేసింది. 2020-21 కంటే ఇది 11% అధికం.
వ్యవసాయం బాగుంది: రిజర్వాయర్లలో కావల్సినంత నీరు ఉండటం, అంచనాలకు తగ్గట్టు వర్షాలు కురవడం వల్ల వేసవిపంటల దిగుబడులు బాగా వస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ ఆదాయం పెరిగినట్లు పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 19.9% పెరిగాయి.
- 2022 -23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి పురోగతిలో సాగుతోంది. మార్చిలో 54గా ఉన్న తయారీరంగ పీఎంఐ, ఏప్రిల్‌లో 54.7కి చేరింది. సేవలరంగ పీఎంఐ కూడా మార్చిలో 53.6 కాగా, ఏప్రిల్‌లో 57.9కు పెరిగింది.
- ఎగుమతులు భేష్: సేవల ఎగుమతులు ఎన్నడూ లేని విధంగా 2021-22లో 254 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. 2020-21లో 82 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా, 2021-22 ఏప్రిల్-ఫిబ్రవరిలో 77 బిలియన్ డాలర్లు వచ్చాయి.
- ఫారెక్స్ నిల్వలు తగ్గుతున్నాయ్: ఈ ఏడాది ఏప్రిల్ 29 నాటికి విదేశీమారకపు ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 597.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) బయటికి వెళ్లిపోతుండటంతో, ఇవి క్రమంగా కరిగిపోతున్నట్లు ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే జనవరి- మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ తగ్గినట్లు పేర్కొంది.
- ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతున్నా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మూలధన వ్యయ ఆధారిత ఆర్థిక విధానం కారణంగా 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 8%మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్థికశాఖË పేర్కొంది.
ఇదీ చదవండి:దడ పుట్టిస్తున్న ధరలు.. 8ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!