ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మోసపూరితంగా రుణం తీసుకున్న కేసులో అరెస్ట్ అయిన వేణుగోపాల్ ధూత్.. ఒకప్పుడు దేశీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరుగా రాణించారు. వీడియోకాన్ గ్రూపును వివిధ రంగాల్లోకి విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి రుణ ఎగవేతదారుగా మారి, ఇప్పుడు జైలు ఊచలు లెక్కించే స్థితికి చేరారు. ఆయన వ్యాపార జీవితంలో ఉత్థాన, పతనాలు ఇలా..
వీడియోకాన్ గ్రూపును 1984లో స్థాపించిన నంద్‌లాల్ మాధవ్‌లాల్ ధూత్ పెద్ద కుమారుడే వేణుగోపాల్ ధూత్. ధూత్ కుటుంబం తొలుత బజాజ్ ఆటో స్కూటర్‌ల డీలర్‌షిప్‌ను నిర్వహించేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో అడుగుపెట్టింది.
టీవీల తయారీతో ఆరంభించి..
దూరదర్శన్ 1982లో టెలివిజన్ కార్యక్రమాలను రంగుల్లో ప్రసారం చేయడాన్ని ప్రారంభించిన తర్వాత.. ధూత్ కుటుంబం కలర్ టీవీల తయారీ ద్వారా వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందుకోసం 1986లో వీడియోకాన్ ఇంటర్నేషనల్‌ను వేణుగోపాల్ ధూత్ స్థాపించారు. ఏటా 1,00,000 టీవీలు తయారు చేయాలన్నది అప్పటి వారి లక్ష్యం. జపాన్‌కు చెందిన సాంకేతిక దిగ్గజం తోషిబాతో జట్టుకట్టి, ఉత్పత్తులను ఆవిష్కరించాక ఆయన వెనుదిరిగి చూసింది లేదు.
- 1990లో రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, ఎయిర్ కండీషనర్‌లు లాంటి ఇతరత్రా విభాగాలకూ సంస్థ విస్తరించింది. అందుబాటు ధరకే ఆయా ఉత్పత్తులను ఆవిష్కరించి, మిర్క్ ఎలక్ట్రానిక్ (ఒనిడా), సలోరా, వెస్టన్ లాంటి సంస్థలకు గట్టి పోటీనిచ్చింది. వీడియోకాన్ రూపొందించి బజూకా, బజూమ్బా టీవీ మోడళ్లు 1990 ప్రారంభంలో అత్యంత ఆదరణీయ మోడళ్లలో ఒకటిగా ఉండేవి.
- ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వ్యాపారంలో విజయవంతం కావడంతో చమురు-గ్యాస్, సెల్యులార్ సర్వీసెస్ లాంటి ఇతర రంగాల్లోకి వీడియోకాన్ గ్రూపును ధూత్ విస్తరింపజేశారు.
విదేశీ కంపెనీల రాకతో
1990 చివర్లో దక్షిణ కొరియా దిగ్గజాలు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, శామ్‌సంగ్ మన దేశంలోకి అడుగుపెట్టాక.. వీడియోకాన్‌కు గట్టి పోటీ ఎదురైంది. వీడియోకాన్‌కు మించిన అధునాతన సాంకేతికత, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అవీ అందుబాటు ధరకే విడుదల చేయడం ఇందుకు కారణం. వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు ఎన్ని రకాల వ్యాపారాలున్నప్పటికీ.. తనకు ప్రధాన నగదును అందించింది ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలే. సోనీ, ఎల్‌జీ, శామ్‌సంగ్ నుంచి పోటీ తీవ్రమై వీడియోకాన్ ఆదాయాలు పడిపోవడమే కాకుండా.. క్రమంగా అప్పుల్లోకి జారిపోయింది.
అప్పులు తీర్చేందుకు
రుణాల చెల్లింపునకు కొన్ని ఆస్తులను విక్రయించేందుకూ ధూత్ ప్రయత్నించారు. తన డీటీహెచ్ వ్యాపారాన్ని డిష్ టీవీలో విలీనం చేశారు. చమురు క్షేత్రాలు, టెలికాం వ్యాపారాల్లో కొన్ని ఆస్తులను విక్రయించినప్పటికీ రుణ సంక్షోభంలో నుంచి ఆయన బయటపడలేకపోయారు. బ్యాంకులకు అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.31,000 కోట్ల మేర వీడియోకాన్ బకాయిపడింది.
మొబైల్ నెట్‌వర్క్ సేవల్లోకి ప్రవేశించాకే..
వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ పేరుతో ధూత్ ఎప్పుడైతే మొబైల్ నెట్‌వర్క్ సేవల్లోకి అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయన పతనం ప్రారంభమైనదిగా భావించవచ్చు. 18 సర్కిళ్లలో సేవలందించేందుకు లైసెన్సులు పొందినా, 11 సర్కిళ్లలోనే వీడియోకాన్ మొబైల్ సర్వీసెస్ వాణిజ్య సేవలను అందించింది.