Cash Transaction Limit Per Day: డిజిటల్ లావాదేవీలు ఎన్ని పెరిగినా.. నగదు ప్రాధాన్యం తగ్గలేదు. వీలైనంత వరకూ నగదుతో కూడిన వ్యవహారాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నగదుపై కొన్ని పరిమితులను విధించింది. వీటిని మీరితే.. అపరాధ రుసుములు తప్పవు.
- భారత ఆదాయపు పన్ను చట్టం.. రూ.2లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. ఉదాహరణకు మీరు రూ.3లక్షలకు ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నారనుకోండి. కచ్చితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, చెక్కు, బ్యాంకు నుంచి బదిలీ ద్వారా మాత్రమే నిర్వహించాలి. రూ.2లక్షల లోపు ఉన్నప్పుడు నగదు చెల్లించవచ్చు.
- మీ కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్ 269ఎస్‌టీ కింద ఒక రోజులో రూ.2లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. దగ్గరి బంధువుల నుంచి తీసుకున్నా రూ.2లక్షలు మాత్రమే అంగీకరించాలి.
- నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర్నుంచి రూ.2లక్షలకు మించి నగదు బహుమతి అందుకోరాదు. ఒకవేళ అంతకు మించి అందుకుంటే, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బహుమతికి సమానమైన మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించే ఆస్కారం ఉంది.
- ఆరోగ్య బీమా ప్రీమియాన్ని కచ్చితంగా చెక్కు లేదా ఆన్‌లైన్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. నగదుగా చెల్లిస్తే సెక్షన్ 80డీ కింద మినహాయింపు కోల్పోతారు.
- వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నప్పుడు ఆ మొత్తం రూ.20వేలకు మించితే ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీ నిర్వహించాలి.