భారత్‌లో కార్లు, ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్ ధరలకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచే వీటి ధరలు పెంచనున్నట్లు వాహనాల తయారీ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతోనే భారత్‌లో వాహనాల ధరలు పెంచుతున్నట్లు తయారీ సంస్థలు వెల్లడించాయి.
టాటా కార్ల ధరలు పెరిగే అవకాశం..
భారత కార్ల తయారీ సంస్థ.. టాటా మోటర్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. వాణిజ్య కార్ల ధరలు 5 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త బీఎస్-6 స్టేజ్ 2లోని నిబంధనల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ కార్ల ధరలు వాటి మోడళ్ల ఆధారంగా పెరగుతాయని వెల్లడించింది.
పెరగనున్న టాటా కార్ల ధరలు పెరగనున్న మారుతీ సుజుకి ధరలు..
మారుతీ సుజుకి కూడా ఏప్రిల్ 1 2023 నుంచి ధరలను పెంచాలని నిర్ణయించింది. అయితే ఏ మేరకు పెంచుతామని మాత్రం వెల్లడించలేదు. కారు మోడల్‌ను బట్టి ధరల్లో పెరుగుదల ఉంటుందని సమాచారం. పెరిగిన కంపెనీ నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటివి ధరల పెంపునకు ప్రధాన కారణాలని సంస్థ తెలిపింది.
పెరగనున్న మారుతీ సుజుకి కార్ల ధరలు "ఏప్రిల్ నుంచి మేము కొత్త ఉద్గార నిబంధనలైన ఆర్డీఈ, ఓబీడీ 2 వైపు వెళ్తున్నాము. ఈ విధానంలో ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఏ మేరకు ధరలు పెంచాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త నిబంధనల వల్ల పెరిగే ఖర్చులు.. ఒక్కో మోడళ్లో ఒక్కో విధంగా ఉంటాయి. ఇంజిన్‌లో ఎన్ని మార్పులు చేయబోతున్నారనేది మోడల్‌పై ఆధారపడి ఉంటుంది" అని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. అదే విధంగా కాల్ల తయారీకి ఉపయోగించే వస్తువులు(ఉదా: స్టీల్, రాగి) ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. కొద్ది నెలలుగా వీటి ధరలు తక్కువగానే ఉన్నప్పటికి రెండేళ్ల క్రితం నాటితో పోలీస్తే.. ఈ వస్తువులు ధరలు భారీగా పెరిగినట్లు ఆయన వెల్లడించారు.
పెరగనున్న ద్వి చక్ర వాహనాల ధరలు..
ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తయారీదారుల చెబుతున్నారు. ఎంట్రీ లెవల్ టూవీలర్ ధరలు రూ.2500 వరకు పెరగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
భారత్‌లో పెరగనున్న బైక్ ధరలు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ధరల పెంపు నిర్ణయం తీసుకునే ముందు.. పరిస్థితులను అంచనా వేస్తామని ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యోగేశ్ మాథుర్ అన్నారు. కానీ వెంటనే ధరల పెంపు ఉండదని ఆయన వెల్లడించారు. ఇది ముడి పదార్థాలు, ఉద్గార నిబంధనలతో సహా.. పలు ఫ్యాక్టర్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే.. ధరల పెంపు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మాథుర్ అభిప్రాయపడ్డారు.
మెర్సిడెస్- బెంజ్ కారు ధరల కూడా..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్-బెంజ్ కూడా భారత్‌లో వాహనాల ధరలు పెంచనున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. యూరోతో పోలిస్తే రూపాయి విలువలో తరుగుదల.. పెరిగిన ఇన్‌పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు కంపెనీకి భారంగా మారినట్లు వెల్లడించింది.
రూ.30వేల వరకు పెరగనున్న ప్యాసింజర్ వాహనాల ధరలు..
ప్యాసింజర్ వాహనాలు గరిష్ఠంగా రూ.30వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనిష్ఠంగా రూ.10వేల వరకు పెరగనున్నాయి. బీఎస్-6 స్టేజ్ 2లో భాగంగా ప్యాసింజర్ వాహనాలకు.. ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్(ఓబీడీ) 2 అనే పరికరాన్ని అమర్చడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సాఫ్ట్‌వేర్‌తో సహా వాహనాల ఇంజన్లలోను మార్పులు చేపట్టాలని సూచించింది. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనలను పాటించాలని తయారీదారులను ఆదేశించింది. దీని కారణంగానే ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి.
మరోవైపు భారత్‌లో ఆడీ కారుకు.. జర్మనీకి చెందిన బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ కార్లకు మధ్య గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా కొత్తగా లాంచ్ అయ్యే వోల్వో వాహనాల నుంచి కూడా ఆడీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎమ్ఐలు పెరిగే అవకాశం..
కార్ల ధరలు పెరగడం వల్ల ఈఎమ్ఐలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. ఈ వాహన ధరల పెంపు.. వాటి రకాలపై ఆధారంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే డీజిల్‌తో నడిచే వాహనాలపై పెంపుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.