New Car Loan Tips : ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా చాలా మంది బ్యాంకుల నుంచి వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మనం ఏ విషయం కోసం లోన్ తీసుకుంటున్నామన్న దాన్ని బట్టి ఆయా రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకునే అవకాశాన్ని కూడా బ్యాంకులు ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది వ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా రుణాలు తీసుకుంటూ నెలనెలా ఈఎంఐల రూపంలో ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
అయితే రుణాల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్, మ్యారేజ్ లోన్ లాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కువగా పర్సనల్ లోన్‌తో పాటు కారు లోన్ తీసుకుంటూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో కొత్తగా కారు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కారు లోన్ వల్ల ప్రయోజనాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సులభ రుణ మంజూరు ప్రక్రియ
బ్యాంకులు కారు లోన్‌ను సులువుగా మంజూరు చేస్తాయి. ముందస్తుగా పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండానే మనం కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. తద్వారా మన వద్ద అవసరమైన మొత్తం లేకపోయినా.. బ్యాంకు నుంచి రుణం పొంది ఆ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.
సకాలంలో చెల్లింపులు
కారు లోన్ తీసుకున్నప్పుడు సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. గడువు తేదీలోగా రుణం చెల్లించడం వల్ల భవిష్యత్తులో వేరే రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మనకున్న మంచి సిబిల్ స్కోర్ కొత్త లోన్ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.