Car Insurance Add on Covers : పురుషులైనా, స్త్రీలు అయినా కారు డ్రైవింగ్ చేయాలంటే కచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ఉండాలి. సాధారణంగా పురుషులతో పోల్చితే.. మహిళలు డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి వారు ఇష్టపడరు. అందువల్ల మహిళల విషయంలో ప్రమాదాలు జరగడం కాస్త తక్కువ. అలాగే బీమా క్లెయిమ్ చేసే అవకాశం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. సంవత్సరంలోపు ఎలాంటి బీమా క్లెయిమ్ చేయకపోతే.. నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) వస్తుంది. ఫలితంగా మహిళలకు బీమా ప్రీమియం కాస్త తక్కువగానే ఉంటుంది.
కారు యజమానులందరికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీని వల్ల ప్రమాదంలో అవతల వ్యక్తి గాయపడినా, మరణించినా.. బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం అందిస్తుంది. కానీ కారు యజమానికి ఎలాంటి పరిహారం అందదు. అందుకే కారుకు జరిగే నష్టాన్ని కవర్ చేసేందుకు సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీమాకు యాడ్-ఆన్లు జత చేయండి
సమగ్ర మోటార్ బీమా కూడా కవర్ చేయని అంశాలు కొన్ని ఉంటాయి. అటువంటి చోట బీమా పాలసీతో పాటు యాడ్-ఆన్లు తీసుకోవాలి. వీటి వల్ల వాహన యజమానులకు మెరుగైన కవరేజీ అందుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే మహిళలకు ఉపయోగపడే కొన్ని యాడ్-ఆన్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
డైలీ అలవెన్స్ కవర్ :
కారు చెడిపోయి మరమ్మతులకు గురైనప్పుడు.. ప్రయాణ ఖర్చులు చెల్లించే యాడ్-ఆన్ ఇది. ఇది ప్రధానంగా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాడ్-ఆన్ ద్వారా రోజువారీ ప్రయాణ ఖర్చుల కోసం రూ.500 వరకు పొందవచ్చు. సాధారణంగా రెండు వారాల వ్యవధి వరకు ఈ కవరేజ్ ఉంటుంది. అంటే దీని వలన మహిళలకు, అలాగే పురుషులకు కూడా ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బీమా కంపెనీకి చెందిన నెట్వర్క్ గ్యారెజీలో మాత్రమే కారు రిపేర్ చేయించాల్సి ఉంటుంది. లేదంటే ఈ యాడ్-ఆన్ చెల్లుబాటు కాదు.
రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ :
ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనుకోకుండా రోడ్డుపై కారు ఆగిపోయినప్పుడు, వాహనం చెడిపోయి రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు.. మహిళలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ యాడ్-ఆన్ అక్కరకు వస్తుంది.
పీహెచ్వైడీ :
మనం ఎలా కారు నడుపుతున్నామో.. ట్రాక్ చేయడానికి కారులో టెలిమాటిక్స్ పరికరాలు ఉంటాయి. వీటి ద్వారా ఎవరు బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఎవరు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తున్నారో తెలిసిపోతుంది. మంచిగా నియమాల ప్రకారం డ్రైవింగ్ చేసేవారికి బీమా ప్రీమియంపై తగ్గింపు వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినా లేదా పరిమితి దాటి వేగంగా ప్రయాణించినా బీమా ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా కారు నడిపే మహిళలకు 'పే హౌ యూ డ్రైవ్' ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యాడ్-ఆన్ సురక్షితంగా డ్రైవింగ్ చేసే మహిళలకు రివార్డ్‌లను అందిస్తుంది.
వ్యక్తిగత వస్తువుల కవర్ :
రోజువారీగా తమతో పాటు విలువైన వస్తువులను తీసుకువెళ్లే మహిళలకు ఈ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. సమగ్ర మోటార్ బీమా పాలసీలో కారుకు ఏదైనా నష్టం వాటిల్లినా, కారు దెబ్బతిన్నా లేదా కారులోని విలువైన వస్తువులు చోరీకి గురైనా.. ఆ నష్టానికి పరిహారం అంటూ ఏమీ ఇవ్వరు. కానీ ఈ యాడ్-ఆన్ వల్ల నిర్దిష్ట పరిమితి వరకు కారు లోపల ఉంచిన వ్యక్తిగత వస్తువులకు జరిగే నష్టాన్ని కవర్ చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీదారుడి నిర్లక్ష్యం కారణంగా సంభవించిన నష్టానికి కవరేజీ లభించదు. ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పుడు కూడా వస్తువులకు కవరేజీ ఉండదు. ఒకవేళ రాత్రిపూట కారులో వస్తువులు వదిలేస్తే.. నిర్లక్ష్యం కింద పరిగణించి బీమా కల్పించరు.
పీఏవైడీ
వాస్తవానికి 'పే యాజ్ యూ డ్రైవ్' (పీఏవైడీ) ఒక యాడ్-ఆన్ కాదు. కానీ ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన ప్లాన్. డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా పాలసీదారుడు ప్రీమియం చెల్లించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అవసరాన్ని అనుసరించి ముందుగా నిర్ణయించిన దూరాలకు అంటే 2500 కి.మీ లేదా 5,500 కి.మీ స్లాబ్లకు పాలసీలను కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారమే ప్రీమియంలు కూడా చెల్లించుకోవచ్చు. కారు ఉపయోగించని సందర్భాల్లో స్విచ్ ఆఫ్ చేసే మోడల్‌ను కూడా ఎంచుకోవచ్చు. దీని వల్ల ప్రీమియం తగ్గుతుంది. హైబ్రీడ్ మోడల్లో తక్కువగా డ్రైవింగ్ చేసే మహిళలకు ఈ పీఏవైడీ అనేది మంచి ఎంపిక అవుతుంది.
నోట్:మహిళలు తమ వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులకు ఏ స్థాయి కవరేజీ సముచితంగా ఉంటుందో తెలుసుకోవడానికి .. తమ వ్యక్తిగత బీమా ప్రొవైడర్‌తో మాట్లాడడం మంచిది.