తమ కంపెనీలు దేశంలో 22 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయని అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళ, మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బంగాల్‌లోనూ అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే అదానీ గ్రూప్ అనతికాలంలో పెద్ద ఎత్తున పురోగమించిందని వస్తున్న ఆరోపణలకు ఆయన పై విధంగా స్పందించారు. శనివారం రాత్రి ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌లో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి వ్యక్తిగత సాయం పొందడం కుదరదని అదానీ తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విధానాల రూపకల్పనలో కొన్ని సలహాలు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏ విధానాన్ని తీసుకొచ్చినా.. అది అందరికీ వర్తిస్తుందని కేవలం అదానీ గ్రూప్‌నకు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ తనని పదే పదే ఆశ్రిత పెట్టుబడిదారుడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోనూ తాము రూ. 68,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపారు. దీన్ని రాహుల్ సైతం ప్రశంసించారని పేర్కొన్నారు. రాహుల్ విధానాలు సైతం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండవని తనకు తెలుసని వ్యాఖ్యానించారు.