తెలంగాణ

telangana

ETV Bharat / business

'దేశ స్వతంత్రతపై చేసిన దాడి'.. హిండెన్​బర్గ్​ నివేదికపై అదానీ గ్రూప్ ఫైర్.. 413పేజీల లేఖ - హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదికపై స్పందించిన అదాని

హిండెన్​బర్గ్ రీసెర్చ్ కంపెనీ విడుదల చేసిన నివేదికపై అదానీ గ్రూప్​ స్పందించింది. హిండెన్​బర్గ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు 413 పేజీల సుదీర్ఘ లేఖను అదానీ గ్రూప్ విడుదల చేసింది. మార్కెట్​లో ప్రతికూల పరిస్థితులు సృష్టించేందుకు తమ సంస్థపై తప్పుడు నివేదిక ఇచ్చారని పేర్కొంది.

adani-in-response-to-hindenburg-research-report
హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ స్పందన

By

Published : Jan 29, 2023, 10:59 PM IST

Updated : Jan 30, 2023, 7:26 AM IST

హిండెన్​బర్గ్ రీసెర్చ్ కంపెనీ చేసిన ఆరోపణలను మరోసారి తీవ్రంగా ఖండించింది అదానీ గ్రూప్​. ఆ సంస్థ ఆరోపణలను భారత్​పై ప్లాన్ ప్రకారం చేసిన దాడిగా అభివర్ణించింది. మార్కెట్​లో ప్రతికూల పరిస్థితులు సృష్టించేందుకు తమ సంస్థపై తప్పుడు నివేదిక ఇచ్చారని పేర్కొంది. హిండెన్​బర్గ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని నొక్కి చెప్పింది. ఈ మేరకు హిండెన్​బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ 413 పేజీల సుదీర్ఘ లేఖను అదానీ గ్రూప్ విడుదల చేసింది.

"ఇదేదో అనుకోకుండా ఓ నిర్దిష్ట కంపెనీపై చేసిన దాడి కాదు.. ఏకంగా భారతదేశంపై జరిగిన దాడి. దేశ స్వతంత్రత, సమగ్రతపై చేసిన దాడి. భారతదేశ అభివృద్ధి ఆశయాలపై చేసిన ప్రణాళికాబద్ధమైన దాడి ఇది. హిండెన్​బర్గ్ రీసెర్చ్.. తప్పుడు సమాచారంతో, వాస్తవాలను దాచేలా ఉంది. ఏదో చెడు ఉద్దేశంతో ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. షార్ట్ సెల్లర్​ (షేర్ల విలువ తగ్గినప్పుడు లాభాలు గడించేవారు)గా తనను తాను ప్రకటించుకున్న సంస్థ.. ఇలాంటి పరిస్థితులు సృష్టించి లాభపడాలని ప్రయత్నిస్తోంది. లెక్కలేనంత మంది ఇన్వెస్టర్లను ఫణంగా పెట్టి ఆర్థికంగా ప్రయోజం పొందాలని భావిస్తోంది."
-అదానీ గ్రూప్

హిండెన్​బర్గ్ తన నివేదిక విడుదల చేసిన సమయంపైనా ప్రశ్నలు సంధించింది అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ ఎఫ్​పీఓ ప్రకటించిన సమయంలోనే ఈ నివేదిక రావడం.. ఆ సంస్థ తప్పుడు దృక్ఫతాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. సరైన పరిశోధన నిర్వహించకుండానే నివేదికను తయారు చేశారని తెలిపింది. హిండెన్​బర్గ్ నివేదిక.. అసలు స్వతంత్ర నివేదిక కానే కాదని మండిపడింది.

హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని అదానీ గ్రూపు పేర్కొంది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగిలిన 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని వివరించింది. వీటిని తమ నమోదిత కంపెనీలు ఖండించాయని అదానీ గ్రూపు తెలిపింది. తమకు వర్తించే చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామని పునరుద్ఘాటించింది. వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే అదానీ గ్రూపు సంస్థల ప్రాధాన్యమని అన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) విజయవంతం అవుతుందని అదానీ గ్రూపు సీఎఫ్‌ఓ జుగ్షిందర్‌ సింగ్‌ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాలు, గనులు, రహదారులు, కొత్త ఇంధనం, డేటా కేంద్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను సొంతం చేసుకునేందుకు సంస్థాగత మదుపర్లకు ఎఫ్‌పీఓ ఓ అద్భుత మార్గమని తెలిపారు.

నికరంగా లాభాల్లోనే ఎల్‌ఐసీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనమైనప్పటికీ.. గత కొన్నేళ్లలో ఈ షేర్లలో పెట్టిన పెట్టబడులపై లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఇప్పటికీ నికరంగా లాభాల్లోనే ఉంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ రూ.28,400 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు ఈ పెట్టుబడుల విలువ రూ.72,200 కోట్లుగా ఉండేది. అయితే రెండో రోజులుగా అదానీ షేర్లు పతనం కావడంతో.. ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.55,700 కోట్లకు దిగివచ్చింది. దీని ప్రకారం ఎల్‌ఐసీ తొలుత పెట్టిన రూ.28,400 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికీ నికరంగా రూ.27,300 కోట్ల లాభంలోనే ఉందన్నమాట. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓలోనూ యాంకర్‌ ఇన్వెస్టర్‌గా ఎల్‌ఐసీ రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది.

Last Updated : Jan 30, 2023, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details