తెలంగాణ

telangana

ETV Bharat / business

'​కృత్రిమ మేధ'పై ఫోకస్.. డేటా గవర్నెన్స్‌ విధానం.. సీతమ్మ అందించు డిజిటల్ భారతం - కృత్రిమ మేధ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు

డిజిటల్ దిశగా ముందుకు వెళ్తున్న భారత్.. మరింతగా పరుగులు పెట్టించేందుకు బడ్జెట్​లో కేంద్రం​ కీలక నిర్ణయాలు తీసుకుంది. ​కృత్రిమ మేధ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Budget 2023 digital india Presented by Nirmalamma
నిర్మలమ్మ అందించు డిజిటల్ భారతం

By

Published : Feb 2, 2023, 7:09 AM IST

డిజిటల్‌ దిశగా ఇప్పటికే ముందడుగు వేసిన భారతదేశం.. ఈ రంగంలో పరుగులు పెట్టేందుకు దోహదపడే పలు చర్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు. దేశ టెక్నాలజీ ఎజెండాను ముందడుగు వేయించి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తామన్నారు. అందులో భాగంగా కృత్రిమమేధకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు, జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానం, సంస్థల డిజిలాకర్లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆధార్‌, కొవిన్‌, యూపీఐ లాంటి ప్రపంచస్థాయి సదుపాయాలతో భారతదేశం ఇప్పటికే పలు విజయాలు సాధించిందన్నారు.

అమృతకాలంలో సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో ఆర్థికరంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. అంకురసంస్థలు, విద్యాసంస్థల్లో పరిశోధన, సృజనాత్మకత కోసం జాతీయ డేటా గవర్నెన్స్‌ విధానాన్ని తెస్తామన్నారు. దీనివల్ల వాటికి డేటా మరింతగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశంలో కృత్రిమమేధ, దేశానికి అది ఉపయోపడేలా చేయడానికి మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల్లాంటి రంగాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి చేసే పరిశోధనలో పరిశ్రమవర్గాలూ పాల్గొంటాయని తెలిపారు.

దీనివల్ల ఈ రంగంలో నాణ్యమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పిల్లలు, యుక్తవయసు వారి కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేస్తామని, ఇందులో వివిధ ప్రాంతాలు, భాషలు, స్థాయిల పుస్తకాలు ఉంటాయని చెప్పారు. కేవైసీ విధానాన్ని మరింత సులభతరం చేస్తామన్నారు. ఇన్నాళ్లూ పౌరులకు సేవలందిస్తున్న డిజిలాకర్‌ను ఫిన్‌టెక్‌ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వీటితో కేవైసీ సేవలు మరింత సరళమవుతాయి.

ఆర్థికసేవలు అందించే సంస్థలకు ఆధార్‌, పీఎం జన్‌ధన్‌ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వివరాలను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతాం. దీని ద్వారా ఆర్థిక సేవలు మరింత త్వరగా పౌరులకు అందుతాయి’ అని ప్రకటించారు. అయితే వీటి భద్రతను మాత్రం ఆయా సంస్థలే చూసుకోవాలన్నారు. ఇక 5జీ సేవలను ఉపయోగించుకునే యాప్‌లు అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 100 ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ఇవి స్మార్ట్‌ తరగతి గదులు, నిర్దిష్ట వ్యవసాయం, ఇంటెలిజెంట్‌ రవాణా వ్యవస్థ, వైద్యసేవలకు ఉపయోగపడతాయి. 2022లో డిజిటల్‌ లావాదేవీలు 76%, వాటి విలువ 91% పెరిగాయని మంత్రి చెప్పారు.

2014-15లో రూ.18,900 కోట్ల విలువైన 5.8 కోట్ల మొబైల్‌ ఫోన్లు దేశంలో ఉత్పత్తి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.75 లక్షల కోట్ల విలువైన 31 కోట్ల యూనిట్లు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్‌ నిలిచిందని, మధ్యాదాయ దేశాల్లో సృజనాత్మక నాణ్యత విషయంలో రెండో ర్యాంకులో ఉందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంకుర సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయపన్ను ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అంకుర సంస్థలు పెట్టిన ఏడేళ్ల వరకు నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరంలోకి తీసుకెళ్లే అవకాశం ఉండగా, దాన్ని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details