- భారత్-బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
India-Britain Trade: రెండు దేశాల వాణిజ్య పునాదులు చాలా బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత బలోపేతం కానున్నాయి. కరోనా ముందు వరకు 23 బిలియన్ పౌండ్ల వాణిజ్యం నమోదైంది. సుమారు అయిదు లక్షల ఉద్యోగాలకు ఆ వాణిజ్యం అవకాశం కల్పించింది. 2030 నాటికి రెండు దేశాల వాణిజ్య విలువలను రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. గడిచిన ఏడాది శ్రీకారం చుట్టిన సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ప్రధానుల సమావేశం మరింత పురోగతికి దోహదపడుతుంది. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో మార్కెట్ వెసులుబాటును మరింత కల్పించాలని ఇప్పటికే నిర్ణయించాం. బ్రిటన్కు చెందిన సుమారు 600 కంపెనీలు భారత్లో ఉన్నాయి. మా దేశంలో 95 వేల మంది భారతీయ ఉద్యోగులున్నారు. భారత్ మాకు రెండో అతిపెద్ద పెట్టుబడి వనరు.
- ఏయే రంగాలపై బ్రిటన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి?
గడిచిన ఏడాది గ్రాంట్ థోర్నటన్ ఆవిష్కరించిన ‘బ్రిటన్ మీట్స్ ఇండియా’ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్కు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఆర్థిక సేవలు, సాంకేతిక, రిటైల్, ఈ-కామర్స్, ఎనర్జీ అండ్ పవర్, ఆరోగ్య సంరక్షణ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడులు పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల వైపు ఇంకా చాలా కంపెనీలు చూస్తున్నాయి. బ్రిటన్కు చెందిన ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థ డెలివెరూ గడిచిన వారంలో హైదరాబాద్లో అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది.
- ఇక్కడ ఐటీ, ఫార్మాసూటికల్ రంగాల్లో పెట్టుబడులకు మీ ఆలోచనలు ఏమిటి?
ఇక్కడ ఐటీ, ఫార్మా కంపెనీలు పురోగమనంలో ఉన్నాయి. బ్రిటన్లో కూడా ఆయా రంగాల్లో భారతీయ కంపెనీలు తమదైన ముద్రను కొనసాగిస్తున్నాయి. ఇక్కడి కంపెనీలు బ్రిటన్లో విస్తరించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. పరిశోధన, అభివృద్ధికి అక్కడ అవకాశాలున్నాయి. యూరప్, ఆఫ్రికా మార్కెట్లకు బ్రిటన్ ముఖద్వారంగా ఉంటుంది. బ్రిటన్ కంపెనీలూ తెలుగు రాష్ట్రాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మైక్రోబయోమిక్స్, జెనోమిక్స్ రంగాల కోసం ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ సృష్టికర్త ఈగిల్ జెనోమిక్స్ సంస్థ బయోరెవల్యూషన్కు పునాది వేసే లక్ష్యంతో హైదరాబాద్లో టెక్హబ్ను ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రకటించింది. జీవశాస్త్రం, డేటా సైన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ను మిళితం చేసి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులతో పోరాటానికి కృషి చేస్తోంది.
- ఉక్రెయిన్-రష్యా వ్యవహారాలు మన సంబంధాలపై ప్రభావాన్ని చూపుతాయా?