వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణలను తస్కరించి, వాటితో యాప్‌లు, రుణ సంస్థల నుంచి మోసపూరింతంగా అప్పులు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో వింటున్నాం. పేరు మీది.. చిరునామా మీది. డబ్బు మాత్రం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. క్రెడిట్ నివేదికలు చూస్తే తప్ప మీరు బాకీ పడ్డారన్న సంగతి తెలియదు. బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు ప్రతి రుణ ఖాతా గురించి, సిబిల్, ఎక్స్‌పీరియన్‌లాంటి క్రెడిట్ బ్యూరోలకు సమాచారం ఇస్తుంటాయి. రుణ వాయిదాల చెల్లింపు తీరును బట్టి, ఆయా సంస్థలు క్రెడిట్ స్కోరును ఇస్తుంటాయి. మోసపూరితంగా మీకు తెలియకుండా రుణం తీసుకున్న సందర్భాల్లో వాయిదాలు చెల్లించరు కాబట్టి, క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. నిజానికి వేరే వ్యక్తులు ఇతరుల గుర్తింపును ఎలా వాడుకుంటారన్నది చాలామందికి చిక్కు ప్రశ్నే.
తెలిసి ఇచ్చినప్పుడు..కొన్నిసార్లు పాన్ ఇతర వ్యక్తుల రుణానికి అనుసంధానం అవుతుంటుంది. ఇది తెలిసే జరుగుతుంది. ఉదాహరణకు ఉమ్మడి రుణం తీసుకున్న సందర్భంలో. జీవిత భాగస్వాములిద్దరూ కలిసి రుణం తీసుకుంటారు. కానీ, చెల్లింపులు ఒకరి ఖాతా నుంచే వెళ్తుంటాయి అనుకుందాం. వాయిదాలు సరిగ్గా చెల్లించకపోతే ఇద్దరి క్రెడిట్ స్కోరుపైనా ఇది ప్రభావం చూపిస్తుంది. వేరే వ్యక్తులు తీసుకున్న రుణానికి హామీ సంతకం చేసినప్పుడూ పాన్ వారి రుణ ఖాతాకు జత అవుతుంది. వారు బాకీ తీర్చకపోతే.. ఆ విషయం మీ క్రెడిట్ నివేదికలోనూ పేర్కొంటారు. ఫలితంగా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. కాబట్టి, మీ క్రెడిట్ నివేదికను పరిశీలించి, ఇలాంటివేమైనా ఉన్నాయా చూసుకోవడం మంచిది.
మోసపూరితంగా..మీ ప్రమేయం లేకుండా కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తులు అనధికారికంగా పాన్‌ను వాడే ఆస్కారం ఉంది. దురదృష్టవశాత్తూ కొన్ని రుణ సంస్థలు పాన్ వివరాలను తనిఖీ చేయకుండానే అప్పులు మంజూరు చేస్తాయి. ఇదే సమస్యలకు కారణం అవుతోంది. తనిఖీ చేస్తే అక్కడే సమస్య పరిష్కారం అవుతుంది. పాన్ అసలు యజమాని ఫిర్యాదు చేస్తే తప్ప దీని గురించి పట్టించుకోవు. అప్పటికే నష్టం వాటిల్లుతుంది.