Bonds investment benefits : మనలో చాలా మందికి స్థిరమైన ఆదాయం కావాలనే కోరిక ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టాలంటే.. నష్టభయం వెన్నాడుతూ ఉంటుంది. ఇలాంటి వారికి బాండ్లు ఒక మంచి ఎంపిక అవుతుంది.
బాండ్లు అంటే ఏమిటి?
ప్రభుత్వాలు, సంస్థలు తమ ఆర్థిక అవసరాల కోసం సాధారణంగా బాండ్లను జారీ చేస్తూ ఉంటాయి. వీటి ద్వారా ప్రజల నుంచి ధనాన్ని సేకరిస్తాయి. అంటే ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి నుంచి నిర్ణీత కాలానికి అవి అప్పు చేస్తున్నట్లు లెక్క. ఇలా బాండ్లు జారీ చేసిన సంస్థలు.. సేకరించిన నగదుకు ప్రతిఫలంగా నిర్ణీత కాల వ్యవధుల్లో సాధారణ వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. మొత్తం గడువు తీరిన తరువాత అసలు సొమ్మును కూడా మొత్తంగా ఇచ్చేస్తాయి.
కొన్ని బాండ్లు నెలనెలా వడ్డీని చెల్లిస్తాయి. మరికొన్ని మూడు, ఆరు నెలలు, ఏడాది ఒకసారి చొప్పున వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. ఉదాహరణకు 10 సంవత్సరాల వ్యవధికి రూ.10,00,000 విలువ చేసే బాండులో 12 శాతం వడ్డీకి మదుపు చేశారనుకుందాం. అప్పుడు నెలనెలా మీకు రూ.10,000 చొప్పున ఆదాయం వస్తుంది. చూశారుగా.. ఈ విధంగా స్థిరమైన ఆదాయం, దీర్ఘకాలంపాటు రావాలని భావించే వారికి బాండ్లు ఒక మంచి ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఉపయోగాలు!
బాండ్లు జారీ చేసిన సంస్థలు క్రమం తప్పకుండా వడ్డీ రేటును అందిస్తాయి. ఇతర పెట్టుబడి మార్గాలతో పోల్చిచూస్తే, మదుపరులు తమ ఆదాయాన్ని కచ్చితంగా అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. బాండ్లలో పెట్టుబడి వల్ల నష్టభయం తక్కువగా ఉంటుంది. సాధారణంగా షేర్మార్కెట్లో ఉన్నంత ఒడుదొడుకులు బాండ్ల పెట్టుబడుల్లో ఉండవు.
బాండ్లు వివిద నిర్ణీత కాలవ్యవధులను కలిగి ఉంటాయి. అందువల్ల మదుపరులు తమకు నచ్చిన వ్యవధికి వాటిని కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా .. మదుపు చేయడానికి బాండ్లు మనకు అవకాశం కలిగిస్తాయి.
బాండ్స్ వర్సెస్ ఫిక్స్డ్ డిపాజిట్స్
మనలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడానికే మొగ్గు చూపుతాం. అందువల్ల ఈ ఎఫ్డీలకు బాండ్లు ప్రత్యామ్నాయమా అనే ప్రశ్న రావడం సహజం. బాండ్లు సాధారణంగా ఫిక్సిడ్ డిపాజిట్లు కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తూ ఉంటాయి. అంతే కాకుండా మీరు మీ పెట్టుబడి కాలవ్యవధికి అనుగుణంగా మెచ్యూరిటీ తేదీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్ఛేంజీల్లో బాండ్లను చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే విక్రయించవచ్చు. ఒక వేళ అత్యవసరంగా నగదు కావాలనుకున్నప్పుడు అలాగే పోర్టుఫోలియోను సర్దుబాటు చేసుకోవాలన్నప్పుడు బాండ్లను అమ్ముకోవడానికి వీలవుతుంది.
ఎఫ్డీలోని నగదును ముందుగా వెనక్కి తీసుకంటే.. జరిమానా కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల పెట్టుబడిదారునికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. బాండ్లకు నిర్ణీత లాకిన్ పీరియడ్ ఉండదు. మార్కెట్ పరిస్థితులను అనుసరించి, మదుపరులు వాటిని విక్రయించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాండ్ల ఉపసంహరణకు ఎలాంటి అపరాధ రుసుములు చెల్లించాల్సిన పని ఉండదు.
బాండ్లలో పెట్టుబడులు - పరిమితులు
బాండ్లలో మదుపు విషయంలో కొన్ని పరిమితులు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా పెట్టుబడిదారులకు సరైన అవగాహన ఉండాలి.
- వడ్డీ రేట్లు : బాండ్ల ధరలు, వడ్డీ రేట్లు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల విలువ తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారుల మూలధనంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
- నష్టభయం : ప్రభుత్వ బాండ్ల విషయంలో ఎలాంటి నష్టభయం ఉండదు. కానీ బాండ్లు జారీ చేసిన ప్రైవేట్ సంస్థలు మాత్రం దివాలా తీసే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల చాలా తక్కువ రేటింగ్ ఉన్న సంస్థల బాండ్లను కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.
- ద్రవ్యోల్బణం :బాండ్ల వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. కానీ కాలగడుస్తున్న కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మన వాస్తవ ఆదాయం తగ్గిపోతుంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బాండ్ల వల్ల ఆదాయం రాకపోవచ్చు.
- నగదుగా మార్చుకోవడం : కొన్ని బాండ్లను అంత సులువుగా ఎక్స్ఛేంజీల్లో విక్రయించలేము. అప్పుడు బాండ్ల లిక్విడిటీ చాలా కష్టమవుతుంది. ఎఫ్డీల్లో అయితే కనీసం మనకు అపరాధ రుసుము వర్తిస్తుంది. కానీ బాండ్లలో ఈ అవకాశం కూడా ఉండదు.
బాండ్లలో మదుపు చేయడం ఎలా?
బాండ్లలో పెట్టుబడులు పెట్టడం చాలా సులువు. మీకు డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు బాండ్ల క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. కానీ బాండ్లలో మదుపు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఇవీ చదవండి :