తెలంగాణ

telangana

ETV Bharat / business

Bisleri Vice Chairperson : వేల కోట్ల వ్యాపారం చేస్తూ.. టాటా, అంబానీలకు సవాల్​ విసురుతున్న అమ్మాయి!

Bisleri International Vice Chairperson : భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలైన రతన్ ​టాటా, ముఖేశ్ అంబానీలతో పోటీపడుతూ.. ఓ అమ్మాయి తన వ్యాపారాన్ని దిగ్విజయంగా నడిపిస్తోంది. రూ.7000 కోట్ల వ్యాపారాన్ని ఒంటి చేత్తో నడిపిస్తూ.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఎవరో తెలుసా?.. ఆమె బిస్లరీ సంస్థల అధినేత్రి.

Bisleri International Vice Chairperson Jayanti Chauhan
Jayanti Chauhan

By

Published : Jul 30, 2023, 5:12 PM IST

Bisleri Jayanti Chauhan : సరదాగా ఆడుతూ, పాడుతూ తిరిగే ఓ అమ్మాయికి.. అనుకోని క్లిష్ట పరిస్థితిల్లో తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టాల్సి వచ్చింది. తనకు ఏ మాత్రం ఇష్టం లేని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయి.. నేడు దిగ్గజ వ్యాపారవేత్తలైన రతన్ టాటా, ముఖేశ్​ అంబానీలకే సవాల్​ విసిరే స్థాయిలో వ్యాపారాన్ని విజయపథంలో నడిపిస్తోంది. రూ.7 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపిస్తోంది. ఆమే జయంతి చౌహాన్​.

తండ్రి కోసం..
Bisleri Ramesh Chauhan :జయంతి తండ్రి రమేశ్​ చౌహాన్​. ఆయన తన బిస్లరీ ఇంటర్నేషనల్​ కంపెనీ బాధ్యతలను తన ఏకైక కుమార్తె జయంతి చౌహాన్​కు అప్పగించాలని ఆశించారు. కానీ జయంతి చౌహాన్ అందుకు అంగీకరించలేదు. దీనితో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్న రమేష్​ చౌహాన్​ తన బిస్లరీ ఇంటర్నేషనల్​ కంపెనీని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కానీ టాటా కంపెనీతో సరైన ఒప్పందం కుదరకపోవడంతో అది కుదరలేదు. దీనితో కంపెనీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలోనే జయంతి చౌహాన్ తన మనస్సును మార్చుకున్నారు. తండ్రి ఆశలను, ఆశయాలను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బిస్లరీ ఇంటర్నేషనల్​ కంపెనీ బాధ్యతలు స్వీకరించారు.

ముఖేశ్ అంబానీతో పోటీ..
Jayanti Chauhan vs Reliance Group : వాస్తవానికి శీతల పానీయాల మార్కెట్​లోకి బిస్లరీ ప్రవేశించడానికి చాలా ముందే.. అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చెందిన రిలయన్స్ కంపెనీ 'కాంపా కోలా' బ్రాండ్​ పేరుతో శీతల పానీయాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ప్రత్యేకంగా దీని కోసమే ముఖేశ్ అంబానీ ప్యూర్ డ్రింక్స్​ గ్రూప్​ను కొనుగోలు చేయడం కూడా జరిగింది. కానీ దీనిని జయంతి చౌహాన్​ ఓ సవాల్​గా తీసుకున్నారు. ముఖేశ్ అంబానీ కంపెనీకి దీటుగా తన బిస్లరీ ఇంటర్నేషనల్​ను విజయపథంలో నడిపించాలని నిశ్చయించుకున్నారు.

రతన్ టాటాతోనూ పోటీ..
Jayanti Chauhan vs Tata Group : బిస్లరీ ఇంటర్నేషనల్​, టాటా గ్రూప్​ల మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్ల ఆ డీల్​ క్యాన్సిల్​ అయ్యింది. దీనితో టాటా కంపెనీ.. టాటా కాపర్+ హిమాలయన్ కంపెనీ​లతో కలిసి, తన సొంత మినరల్​ వాటర్ బ్రాండ్​ను తీసుకువచ్చేందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. దీనిని కూడా జయంతి చౌహాన్​ ఓ సవాల్​గా తీసుకున్నారు.

బిస్లరీ వైస్ ఛైర్​పర్సన్​ జయంతి చౌహాన్​

విజయపథంలో నడిపిస్తూ..
Jayanti Chauhan Net Worth : జయంతి చౌహాన్ నేతృత్వంలోని బిస్లరీ​ కంపెనీ.. కొన్ని సరికొత్త శీతల పానీయాలను (కార్బోనేటెడ్​ పానీయాలను) మార్కెట్​లోకి విడుదల చేసింది. ముఖ్యంగా రెవ్​, పాప్​, స్పైసీ జీరా పేర్లతో సబ్​ బ్రాండ్​లను తీసుకొచ్చింది. మరోవైపు బిస్లరీ లిమోనాటా బ్రాండ్ పేరుతోనూ.. శీతల పానీయాలను విక్రయిస్తోంది.

జయంతి ఇక్కడితో ఆగకుండా బిస్లరీ బ్రాండ్​ పానీయాల విక్రయాలను మరింత పెంచేందుకు.. డిజిటల్, సోషల్​ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తోంది. ఈ విధంగా రూ.7000 కోట్ల విలువైన కంపెనీని ఒంటి చేత్తో విజయపథంలో నడిపిస్తోంది జయంతి చౌహాన్​.

ఫ్యాషన్​ అంటే మక్కువ!
Jayanti Chauhan Education : జయంతి చౌహాన్ పుట్టుకపోతే సంపన్నురాలు కావడం వల్ల ఆమె చాలా గారాభంగా, సుకుమారంగా పెరిగింది. ముంబయి, దిల్లీ, న్యూయార్క్ నగరాల్లో ఆమె బాల్యం, విద్యాభ్యాసం జరిగింది. తరువాత ఆమె లాస్​ ఏంజెల్స్​లో ఫ్యాషన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ డిజైన్​ అండ్​ మర్చెండైజింగ్​ నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు. అలాగే ​ ఇన్​స్టిట్యుటో మారంగోని మిలానో నుంచి ఫ్యాషన్​ స్టైలింగ్​లో డిగ్రీ పొందారు. లండన్​ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్​లో ఫ్యాషన్​ ఫోటోగ్రఫీ అండ్ స్టైలింగ్​ చేశారు.

ఫ్యాషన్​ డిజైనింగ్​లో డిగ్రీ చేసిన జయంతి చౌహాన్​

ఈ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్​పై ఎంతో మక్కువ పెంచుకున్న జయంతి చౌహాన్​.. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రి వ్యాపారాన్ని స్వీకరించారు. నేడు దిగ్గజ వ్యాపారవేత్తలైన రతన్ టాటా, ముఖేశ్​ అంబానీలతో పోటీ పడుతూ బిస్లరీ ఇంటర్​నేషనల్​ను విజయపథాన నడిపిస్తున్నారు. ఈ విధంగా ఎంతో మంది యువతీయువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details