కరోనా మహమ్మారి తర్వాత అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలపై ప్రీమియం మొత్తాలను పెంచేందుకు సన్నద్ధం అవుతున్నాయి. గతేడాది అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు 30 శాతం వరకు బీమా ప్రీమియం మొత్తాన్ని పెంచాయి. అయితే ఈ ఏడాది కూడా ప్రీమియాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ప్రీమియం తగ్గించుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని తెలుసుకు ఆరోగ్య బీమా ఖర్చును కొంతవరకు ఆదా చేయవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..!
ఆన్‌లైన్‌లో కొనుగోలు..
బీమా పాలసీని ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో పోల్చితే ఆన్‌లైన్‌లో బీమా పంపిణీకి చాలా ఎక్కువ మొత్తం అవసరం. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆన్‌లైన్‌లో బీమాను కొనుగోలు చేస్తే కంపెనీలు కొంతమేర నిర్వహణ వ్యయాలు తగ్గించుకోగలుగుతాయి. వారికి కలిగే ఈ ప్రయోజనంలో కొంత మొత్తాన్ని పాలసీదారులకు అందిస్తాయి. దీనిలో భాగంగా చాలా కంపెనీలు ప్రీమియంలో రాయితీలు కల్పిస్తాయి.
చిన్న వయసులోనే..
ఆరోగ్య బీమా పాలసీ అనేది ఎంత చిన్న వయస్సులో తీసుకుంటే అంత మంచిది. దీని వల్ల డబ్బును కూడా ఆదాచేయవచ్చు. ఎలా అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం, రక్తపోటు వంటివి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముందు నుంచి వ్యాధులు ఉన్నవారికి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న వయస్సులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
లాంగ్ టైమ్ పాలసీ
ఈ మధ్య ఒకేసారి ప్రీమియం చెల్లించి 3 సంవత్సరాల వరకు ప్రీమియం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఆరోగ్య పాలసీలను అందిస్తున్నాయి. కొన్ని నెలలు, ఒక సంవత్సరానికి తీసుకున్న పాలసీల కంటే.. ఎక్కువ కాలానికి తీసుకున్న పాలసీలతో ప్రీమియం తగ్గింపు ఉంటుంది. దీంతోపాటుగా ఏటా పెరిగే ప్రీమియం పెంపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రెండేళ్ల ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. అదే మూడేళ్ల పాలసీపై అయితే 15 శాతం వరకు ప్రీమియం తగ్గింపును పొందే అవకాశం ఉంది.
ఫ్యామిలీ పాలసీ..
ఏదైనా ఒక్కొక్కటీ తీసుకోవడం కంటే ఒకేసారి అధిక మొత్తంలో తీసుకోవడం మంచిదని మనందరికి తెలుసు. బీమా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా పాలసీలు వ్యక్తిగత అవసరాలకు అనుకగుణంగా వేర్వేరుగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ఉన్న బీమా సంస్థలు.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఒక కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయే విధంగా రూపొందించాయి. ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే వ్యక్తిగత పాలసీకు అయ్యే మొత్తంతో పోల్చుకుంటే.. ఫ్యామిలీ- ఫ్లోటర్ ప్లాన్ మొత్తం కుటుంబ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. కుటుంబం మొత్తం గ్రూప్‌గా కలిపి ప్రీమియం తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది. కుటుంబంలో వైద్య చికిత్స అవసరమైన ఎవరైనా సరే ఈ బీమా ప్లాన్ కింద ఉన్న మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్..
నో క్లెయిమ్ బోనస్(NCB) తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా మొత్తాన్ని పొందడానికి ఇదో అద్భుతమైన మార్గం. మనం బీమా పాలసీ తీసుకున్న తర్వాత దాని కాల వ్యవధి ముగిసే లోపు ఎటువంటి బీమా క్లెయిమ్ చేయకుంటే.. అదనపు ప్రీమియం చెల్లించకుండానే నెక్ట్స్ ఇయర్లో మీ పాలసీలో భాగంగా అదనపు బీమా మొత్తాన్ని పొందవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా బీమా సంస్థలు ఎన్‌సీబీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు మీరు రూ.10 లక్షల విలువచేసే పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రీమియాన్ని క్లెయిమ్ చేయలేదు అనుకుంటే... అప్పుడు గతంలో ఉన్న పాలసీతో కలిసి ప్రస్తుతం ఉన్న పాలసీలో అదనంగా రూ.8-10 లక్షల బీమాని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది మనం ఎంచుకున్న పాలసీని బట్టి మారుతూ ఉంటుంది.