తెలంగాణ

telangana

ETV Bharat / business

షార్ట్​ టర్మ్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త.. ఈ పథకాలైతే బెటర్! - షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్

వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పెట్టుబడి పథకాలను ఎంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వల్పకాలికం అంటే 1-5 ఏళ్ల వ్యవధికి మదుపు చేసేవారు సరైన పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే పెట్టుబడికి నష్టం లేకుండా, రాబడి సాధించే అవకాశం ఉంటుంది.

short term investment examples
short term investment plan

By

Published : Nov 7, 2022, 4:13 PM IST

మన అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను బట్టి, పెట్టుబడి పథకాల ఎంపిక ఉండాలి. దీర్ఘకాలిక పథకాలు మంచి రాబడినిస్తాయి. స్వల్పకాలిక పథకాల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు వెనక్కి తీసుకునే వీలుంటుంది. కాబట్టి, కాస్త సురక్షితంగా ఉండే వాటిని ఎంచుకోవడం అవసరం.

లిక్విడ్‌ ఫండ్లలో
అత్యవసర నిధిని జమ చేసేందుకు వీటిని పరిశీలించవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతాతో పోలిస్తే వీటిలో కాస్త అధిక రాబడి అందుతుంది. ఇవి సురక్షితమైన పథకాలుగా చెప్పొచ్చు. మదుపు చేసినప్పటి నుంచి ఎప్పుడైనా సరే డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. పన్ను తర్వాత 4-7 శాతం రాబడిని అందిస్తాయి. రోజు నుంచి 90 రోజుల వరకూ వీటి వ్యవధి ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే వీటి ఎన్‌ఏవీ తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. యూనిట్లను అమ్మిన రెండు మూడు పనిదినాల్లో డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.

ఆరు నెలల వరకు..
కంపెనీలకు రుణాలనిచ్చే అల్ట్రా షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్లలో 3 నుంచి 6 నెలల కాలానికి మదుపు చేసుకోవచ్చు. లిక్విడ్‌ ఫండ్లతో పోలిస్తే వీటిలో కాస్త నష్టభయం ఉంటుంది. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో సమానంగా, కాస్త అధికంగా ఇవి రాబడిని అందిస్తాయని చెప్పొచ్చు.

ఈక్విటీల తరహాలోనే..
ఈక్విటీలతోపాటు, ఫ్యూచర్స్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కాస్త అధిక లాభాలను సంపాదించే వ్యూహంతో ఆర్బిట్రేజ్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వార్షిక రాబడి దాదాపు 8-9 శాతం వరకూ అందే అవకాశం ఉంది. వీటిలో వచ్చిన మూలధన లాభానికి ఈక్విటీ ఫండ్లకు వర్తించే పన్ను నిబంధనలే వర్తిస్తాయి. మూడు నుంచి అయిదేళ్ల కాలానికి వీటిని పరిశీలించవచ్చు.

నగదు మార్కెట్లో..
మ్యూచువల్‌ ఫండ్లలో అత్యల్ప నష్టభయం ఉన్న పథకాలుగా మనీ మార్కెట్‌ ఫండ్లను చెప్పుకోవచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేసే ఈ పథకాలు మూడు నెలల నుంచి ఏడాది పెట్టుబడికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. గరిష్ఠ పన్ను శ్లాబులో ఉన్నవారు.. ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిశీలించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details