Get Rs 5000 per Month after 60 Years : దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఉద్దేశంతో కేంద్రం వివిధ స్కీమ్స్‌ను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే పదవీ విరమణ లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా కేంద్ర సర్కార్ సరికొత్త పెన్షన్ స్కీమ్(Pension Scheme)ను తీసుకొచ్చింది. దీనిలో చేరినట్లయితే మీరు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5వేల పెన్షన్ పొందవచ్చు. వృద్ధాప్యంలో ఎవరి సహాయం అవసరం లేకుండా మీరు కేంద్రం నుంచి వచ్చే ఈ పెన్షన్‌తో జీవితాన్ని హాయిగా ముందుకు సాగించవచ్చు. చాలా మంది నిరుపేద, సామాన్య ప్రజలు పెన్షన్ స్కీమ్‌లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక వెనకడుగువేస్తుంటారు. అలాంటి వారు కూడా కేవలం రోజుకు 7 రూపాయలు మాత్రమే చెల్లించే ఈ పెన్షన్ స్కీమ్‌లో ఈజీగా చేరవచ్చు. ఇంతకీ ఏంటి ఆ స్కీమ్? అర్హతలేంటి? ఏ విధంగా దీనిలో చేరాలి? లాంటి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం 2015-16లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించేందుకు అటల్ పెన్షన్ యోజన(APY) అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరడం ద్వారా 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి గరిష్ఠంగా రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.
ఈ స్కీమ్ అర్హతలు ఏమిటి?
Atal Pension Yojana Eligibility Criteria :ప్రభుత్వ నియమాల ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. అందువల్ల 18 సంవత్సరాలు నిండి చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ స్కీమ్‌లో చేరి తమ భవిష్యత్తు పదవీవిరమణ జీవితం కోసం పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, 40 ఏళ్ల తర్వాత దీనిలో చేరేందుకు అర్హత లేదు. అలాగే దీనిలో చేరేవారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.
ఏపీవై స్కీమ్‌లో ఎలా చేరాలంటే..అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టి ఈ పెన్షన్ పథకంలో చేరవచ్చు. అలాగే ఈ స్కీమ్‌లో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.