Best Mutual Fund Plans For Your Children : పిల్లలకు మంచి భవిష్యత్ కల్పించాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. అందుకోసం తమ కష్టార్జితాన్ని పణంగా పెడతారు. అయితే పిల్లల భవిష్యత్ కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నేడు చాలా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. మరి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యా ఖర్చుల కోసం..
నేటి కాలంలో విద్య పూర్తిగా వ్యాపార వస్తువు అయిపోయింది. అందువల్ల వల్ల ఉన్నత విద్య అభ్యసించాలంటే.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిందే. పైగా నేడు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కనుక మీ పిల్లల చదువుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదే.
పిల్లల మ్యూచువల్ ఫండ్స్
నేడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు పిల్లల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. చైల్డ్ కెరీర్ ప్లాన్, చైల్డ్ గిఫ్ట్ ప్లాన్ లాంటి పేర్లతో అనేక మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తెచ్చాయి. వాస్తవానికి గతంలోనూ ఇలాంటి పథకాలు ఉన్నప్పటికీ.. నేడు పెరిగిన డిమాండ్ దృష్ట్యా మరిన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి.
లాకిన్ పీరియడ్
సెబీ నిబంధనల ప్రకారం, ఈ పిల్లల మ్యూచువల్ ఫండ్లకు 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందయితే.. అప్పుడు మీ పెట్టుబడులను వెనక్కు తీసుకునే వీలుంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి ఓపెన్ ఎండెడ్ హైబ్రిడ్ పథకాలు. ప్రధానంగా ఇవి ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేస్తాయి. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇచ్చే బాండ్లలోనూ పెట్టుబడి పెడతాయి. దీని వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల మ్యూచువల్ ఫండ్స్ సురక్షితంగా ఉండేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తాయి.
ఈ పిల్లల మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీల్లో 65% వరకు, డెట్ ఫండ్లలో 35% వరకు మదుపు చేస్తాయి. కొన్నిసార్లు ఈక్విటీలకు 75% వరకు కూడా కేటాయించే అవకాశాలు ఉంటాయి.